ఆడపిల్ల పుట్టిందన్న అక్కసుతో భార్యను కడతేర్చేందుకు ప్రయత్నించాడో దుర్మార్గపు భర్త. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలపాలెంలో చోటుచేసుకుంది. 2016లో  అపర్ణ అనే మహిళను గంగు నాయుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

ఇటీవల అపర్ణకు ఆడపిల్ల పుట్టడంతో గంగు నాయుడు సహించలేకపోయాడు. ఈ కారణంతో గత కొంత కాలంగా భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌ 20 తేదీన నీళ్లలో యాసిడ్‌ కలిపి ఇచ్చాడు. 

దీంతో అపర్ణ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి పథకం ప్రకారం భార్యను చంపేందుకు గంగు నాయుడు ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులతో  కలిసి అపర్ణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.