విశాఖపట్నం: దురుసుగా ప్రవర్తిస్తోందని ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. ప్రేమించి పెద్దలను ఒప్పించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇరువురి మధ్య మనస్పర్థలు పొడసూపాయి. తన పట్లనే కాకుండా తన కుటుంబ సభ్యుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తుందనే ఆగ్రహంతో భర్త భార్యను చంపేశాడు. 

మిత్రుడు, కుటుంబ సభ్యుల సాయంతో అతను భార్య గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని వన్ టౌన్ పోలీసు పరిధిలో ఆదివారం అర్థరాత్రి జరిగింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన మౌళి (25) కొంత కాలంగా విశాఖపట్నంలో ఉంటూ ఫైర్ అండ్ సేప్టీకి చెందిన పైపులైన్లను అమర్చే పనిచేసేవాడు. 

విశాఖపట్నంలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తున్న పాతనగరం కొడి పందాల వీధికి చెందిన చల్లపల్లి లక్ష్మి (21)ని ప్రేమించి నిరుడు అక్టోబర్ నెలలో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత భార్యను తీసుకుని విజయనగరంలోని తన స్వగ్రామం వెళ్లిపోయాడు. ప్రేమ వివాహమే అయినప్పటికీ కట్నకానుకలు దండిగానే ఇచ్చారు. 

కాగా, మే నెల నుంచి దంపతులు విశాఖపట్నం వచ్చి కోడి పందాల వీధిలోని లక్ష్మి పుట్టింట్లో ఉంటూ వచ్చారు. తాగుడుకు బానిసైన మౌళి తన స్నేహితుడు ఎల్లాజీతో కలిసి నిత్యం మద్యం సేవిస్తూ వచ్చాడు. కాగా, అత్తవారింట్లో లక్ష్మి తన భర్తతో పాటు కుటుంబ సభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించేదని అంటారు. అదే విషయాన్ని మౌళి ఎల్లాజీకి చెప్పాడు. ఆ తర్వాత భార్య కుటుంబ సభ్యులతోనూ మాట్లాడాడు. 

లక్ష్మి తల్లి, అక్క, సోదరుల ప్రోత్సాహంతో భార్యను చంపాలని పథకం వేసుకున్నాడు. అందులో భాగంగా ఇంటి నుంచి ముందుగానే లక్,్మి తల్లి, సోదరి, సోదరుడు బయటకు వెళ్లిపోయారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత లక్ష్మి, మౌళి ఘర్షణ పడ్డారు. భార్య దాడి చేయడంతో మౌళి చున్నీ సాయంతో ఆమె పీక బిగించి హత్య చేశాడు. అందుకు ఎల్లాజీ సాయపడ్డాడు. పోలీసులు మౌళి, ఎల్లాజీలను అరెస్టు చేశారు.