విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో అక్రమ సంబంధం ఓ హత్యకు దారి తీసింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఆమె భర్త హత్య చేశాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని పరవాడ మండలం బండారుపాలెం నుంచి ముత్యాలమ్మ మార్గంలో తోటలో జరిగింది. 

తోటలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆ కేసును ఛేదించారు. ధర్మరాజు అనే ఆ వ్యక్తి హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గుర్తించారు. పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ పరిధిలో హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు (40) అచ్యుతాపురంోలని ఓ కంపనీలో కార్మికుడుగా పనిచేసేవాడు. 

అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. ముత్యాలమ్మ పాలెెం పంచాయతీ పరిధిలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి అతను సారాయి తాగడానికి వెళ్లేవాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. 

వారిద్దరు ముత్యాలమ్మ పాలెం, బండారుపాలెం మధ్యలో గల జీడిమామిడి తోటల్లో కలుసుకునేవారు. ఈ విషయం మహిళ భర్త కుళ్లయ్యకు తెలిసింది. దాంతో ధర్మరాజుపై అతను కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 2వ తేదీన తన భార్య నగదు, సారాయి పట్టుకుని బయటకు వెళ్లడం చూసిన కుళ్లయ్య సెల్ ఫోన్ చార్జర్ పట్టుకుని చాటుగా వెంబడించాడు. 

జీడిమామిడి తోటలో ధర్మరాజు, ఆమె కనిపించారు. దాంతో భార్యను కుళ్లయ్య కొట్టాడు. కుళ్లయ్యపై ధర్మరాజు ఎదురు తిరిగాడు. దాంతో కుళ్లయ్య ఆగ్రహావేశంలో సెల్ ఫోన్ వైరును ధర్మరాజు గొంతుకు బిదించి అతన్ని హత్య చేశాడు. తన భర్త కనిపించడం లేదని ధర్మరాజు భార్య ఈ నెల 3వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు ఈ నెల 6వ తేదీన ధర్మరాజు మృతదేహాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో కుళ్లయ్య ఉదంతం తెలిసింది. దాంతో కుళ్లయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.