"విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత సబ్బం హరి ఇంటి ప్రహరీగోడను గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు కూల్చివేస్తున్నారు. ఆయన ఇంటికి ఆనుకుని ఉన్న టాయిలెట్ గదిని వారు కూల్చివేశారు. శనివారం తెల్లవారు జామున 4.30 గంటలకు వచ్చి కూల్చివేతలు చేపట్టారు. వాటిని అధికారులు అక్రమ కట్టడాలుగా చెబుతున్నారు. పార్కు స్థలాన్ని అక్రమించి సబ్బం హరి నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతున్నారు.

అయితే ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని అధికారులను సబ్బం హరి ప్రశ్నించారు. కూల్చివేతలపై అధికారులు సబ్బం హరికి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. కూల్చివేత ఘటనతో సబ్బం హరి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు పాల్పడడాన్ని సబ్బం హరి తప్పు పడుతున్నారు. నోటీసులు ఇచ్చి ఉంటే తానే స్థలాన్ని అప్పగించి ఉండేవాడినని అంటున్నారు. 

వైఎస్ జగన్ ను ఎదుర్కునే వ్యక్తి తాను ఒక్కడినే కాబట్టి ఏమీ చేయలేక ఈ చర్యకు పాల్పడ్డారని సబ్బం హరి అన్నారు. తప్పు జరిగితే నష్టపరిహారం ఇస్తామని అధికారులు అంటున్నారని ఆయన చెప్పారు.

సబ్బం హరి తొలుత వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైపు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన పార్టీలో చేరారు. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు. 

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.