విశాఖపట్నం: కేసుల నుంచి తప్పించుకుందామని బీజేపీలో చేరితే అంతకన్నా పొరపాటు మరోకటి ఉండదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ అవినీతికి ఎప్పుడూ వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. 

బీజేపీలో చేరినంత మాత్రాన వారి కేసులు మాఫీ కావని క్లారిటీ ఇచ్చారు. వారి కేసులకు సంబంధించి వారే సమాధానం చెప్పుకోవాలని అది వారి వ్యక్తిగతమన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లు బీజేపీ భావజాలంతోనే పనిచేయాలని సూచించారు. 

మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జీవీఎల్ నరసింహారావు. పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన రివర్స్ టెండరింగ్‌ వల్ల ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతుందంటే ఆహ్వానించదగ్గ పరిణామమేనని కొనియాడారు.  

ఖర్చు తగ్గించి పోలవరం నిర్మిస్తామంటే కేంద్రానికి అభ్యంతరం లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. వంద రోజుల పాలనలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని చెప్పుకొచ్చారు. కార్పోరేట్‌లో పన్ను తగ్గింపుతో పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. 

పెట్టుబడులు రావడంవల్ల యువతకు ఉద్యోగాలు లభిస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

విశాఖపట్నం అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందిస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు హామీ ఇచ్చారు. కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని చెప్పుకొచ్చారు.  

ప్రపంచమంతా భారతదేశాన్ని విశ్వశక్తిగా.. ప్రధాని నరేంద్రమోదీని విశ్వనాయకుడిగా ప్రశంసిస్తోందని తెలిపారు. టీడీపీ సొంత తప్పిదాల వల్లే ఓటమి మూటగట్టుకుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. పీపీఏల్లో అవినీతి లేదని తాము చెప్పటం లేదని, సూచన మాత్రమే చేశామని జీవీఎల్ స్పష్టం చేశారు.