టెన్షన్: పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్, పెళ్లికి 90 మంది హాజరు
విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట సమీపంలో గల ఓ గ్రామంలో జరిగిన వివాహానికి హాజరైనవారిలో టెన్షన్ పట్టుకుంది. పెళ్లి కుమారుడికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఓ పెళ్లి తీవ్ర కలకలం సృష్టించింది. పెళ్లి కుమారుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో పెళ్లికి హాజరై భోజనాలు చేసిన 90 మందిలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి.
ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని కోటరవుట్ల మండలం కొడవటిపూడి గ్రామంలో చోటు చేసుకుంది. పెళ్లి కుమారుడు ఆదివారంనాడు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొడవటిపూడి గ్రామానికి చెందిన 31 ఏళ్ల యువకుడు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లానుంచి 20 రోజుల క్రితం వచ్చాడు.
అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 5వ తేదీిన వీఎల్ఎం కిట్ తో కోవిడ్ పరీక్షలు చేసి నమూనాను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పంపించారు. ఫలితం రాక ముందే యువకుడు ఈ నెల 15వ తేదీిన రావికమతం గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు.
అతనికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో వివాహానికి హాజరైనవారు ఆందోళన చెందుతున్నారు. అదే గ్రామంలోని చర్చిలో జరిగిన వివాహానికి పాస్టరుతో పాటు ఇరువైపుల బంధువులు 90 మంది దాకా పాల్గొన్నారు.
అదే రోజు మధ్యాహ్నం ఇంటి వద్ద పెట్టిన భోజనాలకు దాదాపు 500 మంది హాజరైనట్లు చెబుతున్నారు. పెళ్లి కొడుకుకు కరోనా పాజిటివ్ రావడంతో వారందరికీ టెన్షన్ పట్టుకుంది.