విశాఖపట్టణం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం నాడు టీడీపీ కార్యాలయంలో జరిగిన టీడీపీ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. కొంతకాలంగా గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారని ప్రచారం సాగుతున్నందున గంటా శ్రీనివాసరావు ఈ భేటీకి హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు గురువారం నుండి  విశాఖ జిల్లాలో పార్టీ సమీక్ష సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నాడు విశాఖ జిల్లా ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే  పార్టీ సమీక్ష సమావేశానికి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు.

విశాఖ జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు పార్టీ  మారుతారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు మరికొందరు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారని ప్రచారం సాగుతున్న తరుణంలో టీడీపీ సమీక్ష సమావేశానికి గంటా శ్రీనివాసరావు హాజరుకావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకొంది.

వైఎస్ఆర్‌సీపీలోకి గంటాతో పాటు కొందరు  టీడీపీకి చెందిన కీలక నేతలు వెళ్లనున్నారని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. గతంలో కూడ ఇదే రకంగా గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారని ప్రచారం సాగింది.ఈ ప్రచారాన్ని గంటా శ్రీనివాసరావు ఖండించారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని తేల్చిచెప్పారు.

కానీ, ఇటీవల కాలంలో కొందరు వైసీపీకి చెందిన కీలక నేతలతో గంటా శ్రీనివాసరావు చర్చించారని ప్రచారం గుప్పుమంది. కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్న వైసీపీ నేతల ద్వారా గంటా శ్రీనివాసరావు చర్చించారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గంటా శ్రీనివాస రావు గతంలో కడప జిల్లాకు ఇంచార్జీ మంత్రిగా ఉన్న సమయంలో ఆ జిల్లాకు చెందిన వ్యాపారవేత్తలతో సంబంధాలు కలిగి ఉన్న విషయాన్ని ఈ కథనాల్లో ప్రస్తావించారు.

చంద్రబాబునాయుడు గురువారం నాడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. విశాఖ జిల్లాకు చెందిన కీలక నేతల ఆడారి తులసీరావు తనయుడు ఆనంద్ కుమార్ వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ కూడ వైసీపీ గూటికి చేరనున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో ఉత్తరాంధ్రలో పార్టీని కాపాడుకొనేందుకు చంద్రబాబునాయుడు గురువారం నుండి నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు.

: