విశాఖపట్నంలోని గాజువాకకు చెందిన ఓ నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అయితే వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన గంటల వ్యవధిలోనే బాలున్ని సురక్షితంగా కాపాడారు. దీంతో బాలుడి తల్లిదండ్రులే కాదు గాజువాక వాసులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గాజవాకలోని ఆటోనగర్ ప్రాంతంలో రాజస్థాన్ కు చెందిన నరేష్ యాదవ్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడు స్వయంగా ఓ పరిశ్రమను నడుపుతున్నాడు. ఈ పరిశ్రమ కోసం తీసుకున్న రూ.40లక్షల అప్పును చెల్లించకపోవడంతో అతడి కుమారున్ని కిడ్నాప్ చేసిన దుండగులు వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. 

దీంతో తీవ్ర ఆందోళన చెందిన నరేష్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కిడ్నాపర్ల ముఠా నుండి బాలున్ని కాపాడారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు... ఈ కిడ్నాప్ తో ఇంకా ఎవరెవరికి సంబంధముందన్న దానిపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. తమ కొడుకు సురక్షితంగా ఇంటికి చేర్చిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.