విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో తొలి కరోనా మరణం సంభవించింది. 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో గురువారం ఆస్పత్రిలో చేరాడు. అతను కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. అతనికి రాత్రికి రాత్రే పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్ కోసం ఎదురుచూస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. 

అనారోగ్యంతోనే చనిపోయాడని బంధువులు మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి తీసుకు వెళ్ళిన తరువాత రిపోర్ట్ వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు అప్రమత్తమయ్యారు. అతను చికిత్స పొందిన సమయంలో వైద్యులతో సహా సుమారు 50 మంది సిబ్బంది ఉన్నారు. వైద్యులు సిబ్బంది పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

అనంతరం వీళ్ళందర్నీ 14 రోజులుప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్ చేసి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ చెప్పారు. ఈ వార్డులోని వైద్యులు నర్సులు ఇతర సిబ్బంది ఇతర సిబ్బంది పీపీ ఇట్లు ధరించి ఉండడం ఉంటారు కనుక ఎటువంటి సమస్య ఉండదని నమ్ముతున్నారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతోంది. రాష్ట్రంలో అత్యధిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఈ జిల్లాలోనే నమోదవుతున్నాయి. తాజాగా, కర్నూలు వైద్య కళాశాలలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది.

వైద్య కళాశాలలోని వంటమనిషికి కరోనా వైరస్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో పీడీ వైద్య విద్యార్థులు ఆందోళనకు దిగారు. అధికారులు హాస్టల్ ను ఖాళీ చేయించారు. కర్నూలు జిజీహెచ్ లో ఇప్పటికే ముగ్గురు వైద్యులకు కరోనా వైరస్ సోకింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 60 కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంక్య 1463కు చేరుకుంది. తాజాగా 24 గంటల్లో మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 33కు చేరుకుంది.

కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లా 411 కేసులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కారణంగా 10 మంది మృత్యువాత పడ్డారు.