విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. మతిస్తిమితం లేని కూతురిపై తండ్రి కొంతకాలంగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది. ఈ సంఘటనపై బాధితురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. 

పెందుర్తి సీఐ అశోక్ కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు వేపగుంట సమీప గ్రామంలో తాపీమేస్త్రీ (55) తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతుళ్లు ఇద్దరికి పెళ్లిళ్లు జరిగాయి. 

భర్తతో విభేదాలు రావడంతో రెండో కూతురు కొంత కాలంగా పుట్టింట్లోనే ఉంటోంది. మూడు కూతురు (17)కు మతిస్తిమితం లేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి ఆమెపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. రెండు కూతురు ఇటీవల ఆ విషయాన్ని గమనించింది. 

చెల్లెలు అస్వస్థతకు గురి కావడంతో శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు. దీంతో తండ్రిపై బాలిక సోదరి ఆదివారంనాడు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది.