విశాఖ పట్నం జిల్లాలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడి పోలీసులకు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వీరయ్య చౌదరి గ్యాంగ్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

నగరంలోని పరవాడకు చెందిన నిందితుడు.. హీరోహోండా కంపెనీకి చెందిన బైకులను దొంగిలించడంలో సిద్ధహస్తుడు. పార్క్ చేసివున్న వాహనాలను డూప్లికేట్ తాళాల సాయంతో వీరయ్య ఎంతో నేర్పుగా దొంగతనం చేసేవాడు.

ఆయా కేసుల్లో ఇతను ఇప్పటి వరకు 5 సార్లు అరెస్టయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాకా కూడా అతని ప్రవర్తనలో మార్పు రాకపోగా బైకు దొంగతనాల కోసం 15 మందితో ఒక ముఠాను తయారు చేసి పోలీసులకు సవాల్ విసిరాడు.

ఈ క్రమంలో వీరయ్య గ్యాంగ్‌పై నిఘా పెట్టి గురువారం పక్కా ప్రణాళికతో అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 130 బైకులు, రూ.90 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.