విశాఖపట్నం: పక్కా ప్లాన్ తో ఏటీఎం కేంద్రంలో దొంగతనానికి పాల్పడి రూ.9.59లక్షల నగదును దోచుకున్నారు దోపిడీ దొంగలు. గ్యాస్ కట్టర్, సిలిండర్ వంటి సామాగ్రితో ఏటీఎంలోకి చొరబడి తాపీగా దోపిడీకి పాల్పడ్డారు. అంతేకాదు తమ ఆధారాలేవీ చిక్కుకుండా జాగ్రత్తపడి పోలీసులకు సవాల్ విసిరారు ఈ ఏటిఎం దొంగలు. 

విశాఖపట్నంలోని పాత డెయిరీఫాం సమీపంలోని ఏటిఎం కేంద్రం వుంది. జనావాసాలకు కాస్త దూరంగా, రాత్రయితే ఎవ్వరూ అటువైపు రాని, సెక్యూరిటీ లేని ఆ ఏటిఎం కేంద్రంపై దొంగల కన్ను పడింది. దీంతో గురువారం రాత్రి గ్యాస్  కట్టర్, సిలిండర్ వంటి సామాగ్రితో ఏటిఎం కేంద్రంలోకి ప్రవేశించిన దుండగులు షటర్ ను మూసేసి తాపీగా తమపని కానిచ్చారు. 

వెంటతెచ్చుకున్న కట్టర్ సాయంతో ఎటిఎం మిషన్ కత్తిరించి అందులోని రూ.9.59లక్షలను కాజేశారు. అంతేకాకుండా ఆధారాలు లేకుండా వుండేందుకు ఏటిఎం కేంద్రంలోని సిసి కెమెరాను కూడా ధ్వంసం చేశారు. తమతో తెచ్చుకున్న గ్యాస్ కట్టర్, సిలిండర్ ను అక్కడే వదిలేసి డబ్బుతో పరారయ్యారు. 

ఈ దోపిడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న క్రైమ్‌ డీసీపీ సురే్‌షబాబు, ఏడీసీపీ వేణుగోపాలనాయుడు, ఏసీపీ
పెంటారావు, సీఐ ఇమాన్యుయేల్‌రాజు ఏటిఎం కేంద్రాన్ని పరిశీలించారు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.