మాస్క్ పెట్టుకోమన్నందుకు.. స్టోర్ సిబ్బందిపై షూ విసిరి కారులో పరార్
మాస్క్ లేకుండా గడప దాటితే భారీ జరిమానాలను విధిస్తున్నాయి. కేసుల భయం కారణంగా ఒకరితో చెప్పించుకోకుండా ప్రజలే తమంతట తాముగా మాస్కులు ధరిస్తున్నారు.
కరోనా వైరస్ ఏ మూల నుంచి వచ్చి దాడి చేస్తుందో ఎవరికి తెలియదు. దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు తోటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అందుకు ఒకే ఒక్క మార్గం మాస్క్.
వైరస్ వచ్చిన తర్వాత జీవితంలో ఇది అతి ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వాలు సైతం మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్క్ లేకుండా గడప దాటితే భారీ జరిమానాలను విధిస్తున్నాయి.
కేసుల భయం కారణంగా ఒకరితో చెప్పించుకోకుండా ప్రజలే తమంతట తాముగా మాస్కులు ధరిస్తున్నారు. అయితే మాస్కు పెట్టుకోమని విజ్ఞప్తి చేసినందుకు ఓ మహిళ దురుసుగా ప్రవర్తించిన ఘటన అమెరికాలోని ఓక్లహామాలో చోటు చేసుకుంది.
ఓక్లహోమా సిటీకి చెందిన ఓ మహిళ మాస్కు లేకుండానే చెప్పుల షాపులోకి వెళ్లింది. అక్కడున్న మహిళా సిబ్బంది ఆమెను మాస్కు పెట్టుకోమని సూచించింది. అయినప్పటికీ ఆమె ఇదేమి పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటోంది.
దీంతో సదరు ఉద్యోగిని మరోసారి చెప్పి చూసింది. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మహిళ దగ్గరున్న షూ బాక్సులను తీసుకుని సిబ్బందిపైకి విసిరేసింది. అనంతరం మెయిన్ డోర్ గుండా బయటకు నడుచుకుంటూ వెళ్లింది.
ఈ పరిణామంతో షాక్ తిన్న మహిళా ఉద్యోగిని వెంటనే తేరుకుని ‘‘ మీరు నాపై దాడి చేశారు... మీ లైసెన్స్ నెంబర్ ఇవ్వండి’’ అంటూ ఆమె వెనకాలే వెళ్లింది. అప్పటికే నిందితురాలు కారులో వెళ్లిపోయింది.
అయితే ఆమె తన పర్సును కౌంటర్‌లో వదిలి వెళ్లడంతో దాని ఆధారంగా షాపు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి సీసీ కెమెరాల్లో ఈ ఘటనకు తాలుకూ వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.