ఊరి మీద పడిన కోతులు: 70 ఏళ్ల వితంతువు ఇంట్లో రూ. 25 వేలు, బంగారం చోరీ
ఓ కోతుల గుంపు ఇంటికిలోకి చొరబడి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లిన అరుదైన ఘటన తమిళనాడులో జరిగింది
మనుషుల స్వార్ధానికి అడవులు నామ రూపాలు లేకుండా పోతుండటంతో వన్యప్రాణులు జనావాసాలపై పడుతున్నాయి. ఈ క్రమంలో ఇళ్లలోకి వచ్చి తినుబండారాలను ఎత్తుకెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఓ కోతుల గుంపు ఇంటికిలోకి చొరబడి డబ్బు, బంగారం ఎత్తుకెళ్లిన అరుదైన ఘటన తమిళనాడులో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. తిరువైయారూకు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధురాలు జి. శరతంబల్ తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. తనకు వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందని ఎంతో కష్టపడి డబ్బు, బంగారం సంపాదించుకుంది.
అయితే ఓ రోజున శరతంబల్ బట్టలు ఉతకడానికి ఇంటి నుంచి బయటికి వెళ్లింది. ఈ సమయంలో కోతులు ఆమె ఇంట్లోకి చొరబడి అరటి పళ్లు, బియ్యం సంచి తీసుకుని పారిపోయాయి.
శరతంబల్ ఇన్ని రోజులుగా కష్టపడి సంపాదించని సొమ్ముతో పాటు కొద్దిపాటి బంగారాన్ని ఆమె బియ్యం సంచిలోనే ఉంచింది. పాపం కోతులు వీటన్నింటిని తీసుకుని పారిపోయాయి.
ఇంటికి తిరిగి వచ్చిన శరతంబల్‌కి బియ్యం సంచి కనిపించకపోవడంతో బయటకు వచ్చి చూసింది. అదే సమయంలో ఇంటి పై కప్పు మీద కోతుల చేతిలో బియ్యం సంచి చూసి తీసుకోవడానికి ప్రయత్నించింది.
కానీ కోతులు వేగంగా అక్కడి నుంచి పారిపోయాయి. వాటిని పట్టుకునేందుకు ఆమె అరుస్తూ అనుసరించింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు కోతులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఆమె ఎంత ప్రయత్నించినా కోతులను పట్టుకోలేకపోయింది.
ఆ బియ్యం సంచిలో రూ.25 వేల నగదుతో పాటు కొద్దిపాటి బంగారం కూడా ఉన్నట్లు ఆమె వాపోయింది. జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము ఇలా కోతుల పాలవ్వడంతో శరతంబల్ కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.