ఆకాశం నుంచి కుప్పలుగా రాలి పడిన పక్షులు.. వీడియో..!
చాలా పక్షులు తిరిగి ఎగిరిపోగా వందలాది పక్షులు నడక దారి చుట్టుపక్కల పడి చనిపోయాయి. గత సోమవారం ఉదయం 8.20 గంటలకు జరిగిన ఈ అనూహ్య ఘటనను గమనించిన స్థానికులు ఆశ్చర్యపోయారు.
ఆకాశం నుంచి ఒక్కసారిగా పెద్ద వర్షం పడినట్లుగా... పక్షులు నేల రాలాయి. కొన్ని వందల, వేల పక్షులు చనిపోయి పడిపోవడం గమనార్హం. ఈ విచిత్ర ఘటన మెక్సికోలో జరిగింది. ఈ నెల 7న చివావాలో పసుపు తల ఉన్న నల్ల రంగు పక్షుల గుంపు ఒక్కసారిగా ఒక ఇంటి సమీపంలో కిందకు దిగింది. గుంపులోని చాలా పక్షులు తిరిగి ఎగిరిపోగా వందలాది పక్షులు నడక దారి చుట్టుపక్కల పడి చనిపోయాయి. గత సోమవారం ఉదయం 8.20 గంటలకు జరిగిన ఈ అనూహ్య ఘటనను గమనించిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ పక్షుల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పక్షులు విష వాయువు పీల్చి ఉంటాయని లేదా వేడి వల్ల లేదా హైటెన్షన్ విద్యుత్ లైన్ తగలడం వల్ల కాని గుంపులోని కొన్ని పక్షులు మరణించి ఉంటాయని కొందరు అంచనా వేశారు. అలాగే పక్షులు మిస్టరీగా చనిపోవడానికి 5జీ కారణం కావచ్చని మరికొందరు సోషల్ మీడియాలో అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు ఆ పక్షుల గుంపును ఫాల్కన్ లేదా గద్ద వంటి పెద్ద పక్షి ఏదో తరిమి ఉండవచ్చని బ్రిటన్ సెంటర్ ఫర్ ఎకాలజీ, హైడ్రాలజీకి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ రిచర్డ్ బ్రౌటన్ తెలిపారు. దీంతో అల మాదిరిగా ఆ పక్షుల గుంపు ఒక్కసారిగా నేలమీదకు దిగిందని, ఈ క్రమంలో గుంపులోని కొన్ని పక్షులు బలంగా నేలను ఢీకొని మరణించి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.