జుట్టు ఎక్కడ ఉంటుంది..? ఇదేం ప్రశ్న..? ఎవరికైనా తలపైనే ఉంటుంది. నిజమే... కానీ ఓ మైనర్ బాలికకు మాత్రం కడుపులో ఉంది. ఒకటో, రెండో వెంట్రుకలు కాదు.. ఏకంగా అరకిలో వెంట్రుకలు ఉన్నాయి. వాటితోపాటు షాంపూ ప్యాకెట్లు కూడా ఉండటం విశేషం. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో చోటుచేసుకుంది.

Also Read కరోనా కలకలం... కుటుంబాన్ని వైరస్ నుంచి కాపాడిన పెంపుడు కుక్క...

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కోయంబత్తూరులో వైద్యులు ఓ బాలిక (13) కడుపులో నుంచి అరకిలో వెంట్రుకలు, షాంపూ సాచెట్లు తొలగించారు. ఏడో తరగతి చదువుతున్న బాలిక కొన్ని నెలలుగా తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్నది. దీంతో తల్లిదండ్రులు ఆమెను వీజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. 

ఎండోస్కోపీతో పరీక్షించిన వైద్యులు.. ఆమె కడుపులో కొన్ని వస్తువుల ముద్ద ఉన్నట్టు తేల్చారు. డాక్టర్‌ గోకుల్‌ కృపాశంకర్‌ నేతృత్వంలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్సచేసి వెంట్రుకలు, ఖాళీ షాంపూ సాచెట్లు వెలికితీశారు. సమీప బంధువు చనిపోవడంతో ఆ బాలిక తీవ్ర మానసిక వేదనకు గురై వెంట్రుకలు, షాంపూ సాచెట్లను తినడం ప్రారంభించిందని కుటుంబసభ్యులు తెలిపారు.