అడవి పంది ఓ వృద్ధుడిని హడళెత్తించింది. అది పెట్టిన టెన్షన్ కి సదరు వృద్ధుడు దాదాపు ఒక కిలోమీటరు పాటు నగ్నంగా పరుగులు పెట్టాడు. ఈ సంఘటన జర్మనీలో టుఫెల్సీలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జర్మనీలోని టుఫెల్స్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు సన్‌బాతింగ్ కోసమని స్థానిక పార్కులో నగ్నంగా ఎండలో పడుకున్నాడు. కాగా..వెనకనుంచి వచ్చిన పంది ల్యాప్ టాప్‌ ఉన్న అతడి సంచీని ఎత్తుకుపోయింది. దీంతో గాబరా పడిపోయిన వృద్ధుడు.. వెనకా ముందూ ఆలోచించకుండా అలా నగ్నంగానే ఛేజింగ్‌కు దిగాడు. ఏకంగా కిలోమీటరు మేర దాన్ని వెంబడించి తన ల్యాప్‌టాప్‌ను వెనక్కు తెచ్చుకున్నాడు.  

ఈ సీన్ అంతా పబ్లిక్‌గానే జరిగింది. సన్ బాతింగ్ కోసం అక్కడికొచ్చిన అనేక మంది ముందు ఆ వృద్ధుడు పంది వెనకాల పరిగెత్తాడు. అయితే విశ్వప్రయత్నం చేసీ మరీ అతడు తన ల్యాప్‌టాప్ వెనక్కు తెచ్చుకోగలగడంతో అక్కడున్న వారందరూ చప్పట్లు కొడుతూ అతడిని ప్రశంసించారు. కాగా.. స్థానికులు తెచ్చుకున్న ఆహారన్ని తిన్న పంది అకస్మాత్తుగా వృద్ధుడి ల్యాప్‌టాప్‌తో పారిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  ఈ ఉదంతాన్ని ఓ వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.