టెన్త్ లో 35% శాతం మార్కులతో పాసైన కొడుకు.. సంబరాలు చేసుకున్న తల్లిదండ్రులు.. వీడియో వైరల్..
తమ కొడుకుకు టెన్త్ క్లాస్ తో 35శాతం మార్కులు రావడాన్ని సంబరాలు చేసుకున్నారో తల్లిదండ్రులు. దీనికి సంబంధఇంచిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ముంబై : మన దేశంలో పోటీ ఎక్కువ. మార్కులు అందరికంటే ఎక్కువ రావాలనే ఒత్తిడి పిల్లలపై ఎక్కువ. అనుకున్నదానికంటే ఒక్కమార్కు తక్కువ వచ్చినా.. తట్టుకోలేక ఆత్మహత్యలకు చేసుకునే చిన్నారులున్నారు. దీనికి కారణం.. అకడమిక్ మార్కులతోనే మంచి భవిష్యత్ అనే మూస ధోరణిని తల్లిదండ్రులు పిల్లల మెదడ్లలోకి చొప్పించడమే. పదికి పది మార్కులతో ర్యాంకులు కొట్టాలి.. టాపర్ గా నిలవాలి.. చదవాలి.. చదవాలి.. అది తప్ప వేరే లేకపోవడం.. పిల్లలకు పుస్తక పరిజ్ఞానం తప్ప లోకజ్ఞానం అలవడకపోవడం మామూలుగా కనిపిస్తూనే ఉంటుంది.
అయితే, ఈ మూసధోరణిని బద్దలు కొట్టారు ఓ తల్లిదండ్రులు. వారి కొడుకు పదోతరగతి పరీక్షల్లో కేవలం 35 శాతం మార్కులతో అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడు. అది చూసిన తల్లిదండ్రులు కోపానికి రాలేదు. అతడి మీద కేకలు వేయలేదు. అన్ని సబ్జెక్టులూ పాస్ అయ్యాడని సంతోషించారు. అతని ఉత్తీర్ణతను వేడుక చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సదరు విద్యార్థి 10వ తరగతి, మరాఠీ మీడియం పాఠశాలలో చదువుకున్నాడు. మొత్తం 6 సబ్జెక్టులలో 35 చొప్పున మార్కులు సాధించాడు. బాలుడి తల్లిదండ్రులు గర్వంగా, ఆనందంగా అతని మార్కులను ప్రదర్శించారు. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ షేర్ చేశారు.
''ముంబయికి చెందిన 10వ తరగతి విద్యార్థి పరీక్షలో 35% మార్కులు సాధించాడు. కానీ అతని తల్లిదండ్రులు విచారంగా లేదా కోపంగా కాకుండా, అతని విజయాన్ని జరుపుకున్నారు, అని ఈ వీడియోకు క్యాప్షన్ రాశారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో నెటిజన్ల మనసు దోచుకుంది.
ఎలాంటి ఒత్తిడీ పెట్టని తల్లిదండ్రుల హృదయపూర్వక స్పందనను చూసి ఆశ్చర్యపోయారు. సంతోషించారు. ఇలాంటి తల్లిదండ్రులు ప్రతీ ఒక్కరికీ అవసరం.. అబ్బాయి చదువు పూర్తి చేసినందుకు అభినందనలు’ అని ఒకరు స్పందించగా.. మరొకరు, ''గొప్ప పని. తల్లిదండ్రులు పిల్లలను మంచి గ్రేడ్‌లు సాధించాలని ఒత్తిడి చేయకూడదు. సానుకూలంగా ఉండాలి. తల్లిదండ్రుల ఒత్తిడి తరచుగా పిల్లలను ఒత్తిడి, ఆందోళనకు గురి చేస్తుంది. వారు అసురక్షితంగా, వారి సొంత సామర్థ్యాన్ని అనుమానించే అవకాశం ఉంది’ అని కామెంట్ చేశాడు.
మరొకరు తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు.. ''నేను 10వ తరగతిలో 46.7% స్కోర్ చేసాను. మా అమ్మ 1 కిలో బేసన్ లడ్డూల ప్యాకెట్‌ని మా పొరుగువారందరికీ పంచింది. నన్ను నన్నుగా నమ్మినందుకు ధన్యవాదాలు అమ్మ.'' అని రాశారు. ఇంకొకరు రాస్తూ.. ''తల్లిదండ్రులు ఇచ్చే మద్దతు వల్ల ఆ అబ్బాయి మంచి మనిషిగా, భవిష్యత్తులో విజయవంతమవుతాడు’ అని పేర్కొన్నాడు.