ఎంత అంబానీ అయితే మాత్రం.. టిష్యూపేపర్ కు బదులు రూ.500 నోట్లా? నెట్టింట్లో ఫొటో వైరల్.. ఇంతకీ విషయం ఏంటంటే...
అంబానీల పార్టీలోనిదిగా చెబుతున్న ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో డెజర్ట్ తో పాటు రూ.500 నోట్లు ఉండడం ఇప్పుడు హల్ చల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే...
ముంబై : అంబానీల జీవనశైలి, వారి ఐశ్వర్యం ఎప్పుడూ సామాన్యులకు ఆసక్తికరంగానే ఉంటుంది. వారు ఏమి చేసినా వార్తల్లోకి ఎక్కుతుంది. అంబానీలు హోస్ట్ చేసిన పార్టీలు అంటే ఇంక చెప్పనక్కరలేదు.. రాజకీయ, సినీ ప్రముఖులంతా అక్కడే ఉంటారు. అలాంటి పార్టీలో సర్వ్ చేసిన విలాసవంతమైన డెజర్ట్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్‌గా మారింది. ట్విట్టర్ యూజర్ "రత్నీష్" ఈ డెజర్ట్ ఫొటోను షేర్ చేశారు. ఇందులో ఆ డెజర్ట్ బౌల్ ఒక్కోదాంట్లో మూడు రూ. 500 నోట్లు కనిపిస్తున్నాయి. ఈ డెజర్ట్ బౌల్స్ వరకు అతిథుల కోసం టేబుల్‌పై పెట్టి ఉన్నాయి.
ఈ ఫొటోను షేర్ చేస్తూ "రత్నీష్" "అంబానీ జీ కే పార్టీ మే టిష్యూ పేపర్ కి జగహ్ 500 కే నోట్స్ హోతే హై" అంటే అంబానీల పార్టీలో, టిష్యూ పేపర్‌లకు బదులుగా రూ. 500 నోట్లు సప్లై చేస్తారు.. అని రాసుకొచ్చాడు. ఎంత డబ్బు ఎక్కువుంటే మాత్రం ఇలా పారేసుకుంటారా? అని నోళ్లు నొక్కుకోకండి. అవి ఫేక్ నోట్లు. ఫొటోను ఒక్కసారి చూడండి, ఇదొక జోక్ అని నెటిజన్లు తెలుసుకుని నవ్వుకున్నారు.
ఢిల్లీకి చెందిన వారు.. ఈ వంటకం "ఇండియన్ యాక్సెంట్" అని పిలువబడే ఫైన్ డైనింగ్ ఢిల్లీ రెస్టారెంట్‌లో ప్రముఖంగా వడ్డించే వంటకంగా వెంటనే గుర్తిస్తారు. దీనిని "దౌలత్ కి చాట్" అంటారు. వంటకం పేరు గొప్పదనాన్ని సూచిస్తుంది. అంబానీల పార్టీలో వడ్డించడం సముచితమే. దౌలత్ కి చాట్ ఉత్తర భారతదేశానికి చెందిన వంటకం.. ఓల్డ్ ఢిల్లీలో ఈ రుచికరమైన వంటకాన్ని రుచిచూడడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. ఇది తేలికగా ఉండి, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. పాల నురుగుతో ఈ డెజర్ట్ ను తయారు చేస్తారు. నురుగు మీద పిస్తాపప్పులు, ఖోయా, పొడి చక్కెరతో అలంకరిస్తారు.
దౌలత్ కి చాట్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది, శీతాకాలంలో పాలు చిక్కగా ఉన్నప్పుడు, నురుగుతో కూడిన డెజర్ట్ కరగకుండా ఉంటుంది. ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్ నకిలీ నోట్లను వీటికి పెట్టడం ద్వారా ఈ డెజర్ట్‌ను పునర్నిర్మించింది. ఇప్పుడు అర్థమయ్యిందా.. ఆ ఫొటో ఎక్కడిదో.. ఈ డబ్బులు పెట్టడం వల్ల దీనిని "డెజర్ట్ ఆఫ్ ది రిచ్స్" అని పిలుస్తారు. ట్విటర్ పోస్ట్ వాస్తవానికి ఈ డెజర్ట్ గురించి చెబుతుందని, అంబానీలు తమ అతిథులకు డబ్బును టిష్యూ స్థానంలో ఇవ్వలేదని నెటిజన్లు వెంటనే గ్రహించారు.
కానీ పోస్ట్‌లోని ఫన్ నెటిజన్లను అలరించింది. 190వేలకు పైగా వ్యూస్ తో, వైరల్ పోస్ట్ వివిధ కామెంట్లను ఆకర్షించింది. కొందరు వ్యక్తులు డిష్ గురించి ఇతర వినియోగదారులకు అవగాహన కల్పించారు, మరికొందరు పోస్ట్ హెడ్డింగ్ మీద జోకులు వేశారు.