సంప్రదాయ వస్త్రధారణ అనగానే మనకు ఏం గుర్తుకు వస్తుంది..? అమ్మాయిలు పొద్దికగా చీర కట్టుకోవడం... అబ్బాయిలు.... కుర్తా పైజామా లేదంటే పంచ కట్టుకోవడం. కాలేజీలో జరిగిన యాన్యువల్ డేస్ కి, ట్రెడిషనల్ వేర్ కి యువతీ యువకులు ఇలానే తయారై వస్తారు. అయితే... ఓ కాలేజీ విద్యార్థులు మాత్రం భిన్నంగా ఆలోచించారు. చీరలు అమ్మాయిలు మాత్రమే కట్టుకోవాలా ఏంటి..? మేం కట్టుకోకూడదా అంటూ... వాళ్లే అందంగా చీరలు చుట్టేసి కాలేజీలో అడుగుపెట్టారు.  ఈ సంఘటన పూణేలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... పూణేలోని పెర్గూసన్‌ కాలేజీలో ప్రతీ సంవత్సరం నిర్వహించే వార్షిక వేడుకల్లో ఏదో ఒక థీమ్‌ను ఎంచుకొని విద్యార్థులు ఆ వస్త్రధారణలో వస్తుంటారు. అయితే ఈ ఏడాది 'టై అండ్‌ శారీ డే' పేరుతో థీమ్‌ను ఎంచుకొని కాలేజీ యాజమాన్యం వేడుకలను నిర్వహించింది.

ఆ థీమ్ ప్రకారం... అమ్మాయిలు చీరలు, అబ్బాయిలు టైలు కట్టుకోని రావాలని అర్థం. అయితే.. అదే కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఆకాశ్ పవార్, సుమిత్ హోన్వాడజ్కర్, రుషికేష్ సనాప్ లు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు.

అచ్చంగా పదహారణాల చీర కట్టి.. అందంగా ముస్తాబై... కాలేజీలో అడుగుపెట్టారు. వారిని చూసి మిగిలిన విద్యార్థులు షాకయ్యారు. తర్వాత వారి చూసి నవ్వుకున్నారట. అయితే.. కేవలం లింగ సమానత్వం కోసమే తాము ఆ పనిచేశామని వారు చెప్పాక.. మిగిలిన విద్యార్థులు వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. వాళ్లతో ఎగబడి మరీ ఫోటోలు దిగడం గమనార్హం.

ఆకాశ్‌ పవార్‌ స్పందిస్తూ.. 'ఆడవారు చీరలు,సల్వార్‌, కుర్తాలు ధరించాలని, మగవారు షర్ట్‌, ప్యాంట్‌ మాత్రమే వేసుకోవాలని ఎవరు ఎక్కడా చెప్పలేదు. అందుకే ఈ సారి వినూత్నంగా ప్రయత్నించాలనే చీరలు కట్టుకొని వెళ్లాం. అంతేకాదు లింగ సమానత్వం గురించి చెప్పాలని అనుకున్నామని' పేర్కొన్నాడు.

మరో విద్యార్థి మాట్లాడుతూ... 'నేను చీరను ధరించేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. చీర కట్టుకునే సమయంలో ప్రతీసారి అది జారిపడుతుండడంతో ఇక లాభం లేదనుకొని మా స్నేహితురాలు శ్రద్దా సాయం తీసుకున్నాం. ఆమె మాకు చీర ఎలా కట్టుకోవాలో చూపించినప్పుడు అది ఎంత కష్టమైనదో తెలిసింది. అంతేకాదు ఆడవాళ్లు మేకప్‌కు ఎందుకంత సమయం తీసుకుంటారో నాకు ఇప్పుడర్థమయింది' అంటూ సుమిత్‌ చెప్పుకొచ్చాడు.

' చీరను ధరించి నడిచేటప్పుడు మాకు చాలా కష్టంగా అనిపించింది. మా ఫ్రెండ్‌ శ్రద్దాకు థ్యాంక్స్‌ చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆమె మాకు సహాయం చేయకుంటే ఇలా రెడీ అయ్యేవాళ్లం కాదని' రుషికేష్‌ వెల్లడించాడు. అయితే వీరు చేసిన సాహసానికి కాలేజీ యాజమాయ్యం వీరిని ప్రశంసించింది.