ఇతను మామూలోడు కాదు.. ర్యాపిడో డ్రైవర్ తో సంభాషణ వైరల్ .. ఎందుకో తెలిస్తే మీరూ షాక్ అవుతారు...
పరాగ్ జైన్ అనే ప్రయాణికుడు ఓ ర్యాపిడో రైడర్‌తో జరిపిన సంభాషణను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. అదిప్పుడు వైరల్ గా మారింది. అతని కథ స్ఫూర్తిదాయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
బెంగళూరు : తరిచి చూస్తే ప్రతీ మనిషికీ తనదైన కథ ఉంటుంది. జీవితంలోని ఎత్తుపల్లాలుంటాయి. మన కంటికి హాయిగా కనిపించే వ్యక్తి జీవితంలో ఎన్నో సుడిగుండాలుండవచ్చు. స్ఫూర్తిదాయకకథనాలూ ఉండొచ్చు.. జీవితాన్ని గెలిచి, నిలిచి.. పోరాడుతున్న యోధుడు ఉండవచ్చు. అందుకే రూపాన్ని బట్టి, చేస్తున్న పనిని బట్టి మనుషుల్ని అంచనా వేయడం సరైనది కాదు.
ఇదంతా ఎందుకంటే.. ఓ పరాగ్ జైన్ అనే వ్యక్తి ఓ ర్యాపిడో డ్రైవర్ తో తనకు జరిగిన సంభాషణలో ఇలాంటి నిజాల్నే తెలుసుకున్నాడు. ఆ తరువాత ఆ వివరాల్ని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. మామూలుగా క్యాబ్, ర్యాపిడో, ఓలా, ఉబర్, మోటో.. రకరకాల వాహనాలు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయి. పనిమీద బైటికి వెళ్లేప్పుడు వీటిని బుక్ చేసుకుంటాం. హాయిగా మన గోలలో మనం వెళ్లిపోతాం. ఏదైనా తేడావస్తే డ్రైవర్ తో గొడవేసుకుంటాం... కానీ వారి గురించి పట్టించుకోం.. అతనూ మనలాంటి వ్యక్తేనన్న విషయాన్ని గమనించం.
పశ్చిమబెంగాల్ లో దారుణం.. చెత్తకుండీలో పదిహేడు పిండాలు..!
పరాగ్ జైన్ అనే వ్యక్తి ఒకరోజు ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. అతను వచ్చాక.. బైక్ ఎక్కిన తరువాత అతనితో మెల్లిగామాటలు కలిపాడు. అతనెవరు? ఏంటీ? అంతకు ముందు ఇదే పని చేసేవాడా? అనే వివరాలు అడగడం మొదలుపెట్టడు. ఆ డ్రైవర్ చెప్పిన విషయాలు అతడిని షాక్ కు గురిచేశాయి. అతను చెప్పిన విషయాలను ఇలా రాసుకొచ్చాడు పరాగ్ జైన్...
‘ఆ డ్రైవర్ పేరు విఘ్నేష్ నాగబూషణం. నన్ను వీవర్క్‌లో పికప్ చేయడానికి వచ్చాడు. నేను అతనితో మాటలు కలిపినప్పుడు.. విఘ్నేష్ రెండేళ్ల క్రితం ఇదే భవనంలో పనిచేసేవాడని చెప్పాడు. ఇక్కడున్న చైనీస్ కంపెనీ ఆపరేషన్స్ టీమ్‌లో పని చేసేవాడినని విఘ్నేష్ చెప్పాడు. మార్చి 2020లో చైనీస్ యాప్‌లపై నిషేధం కారణంగా అతను ఉద్యోగం కోల్పోయాడు. అది కరోనా కాలం కావడంతో మరో ఉద్యోగం దొరకలేదు. దాంతో విఘ్నేష్ తన చిరకాల కోరిక అయిన.. సినిమా దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. ఓ మినీ సిరీస్ కు దర్శకత్వం వహించాడు. దీనికోసం తన సేవింగ్స్ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు. ఈ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది.
ఈ సిరీస్ దాదాపు 15 ఫిల్మ్ ఫెస్ట్‌లలో విజయం సాధించింది. విఘ్నేష్ OTT నుండి కూడా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆర్థికపరమైన చిక్కులతో వాటిని వదులుకున్నాడు. అప్పటికి విఘ్నేష్ దగ్గరున్న సేవింగ్స్ మొత్తం అయిపోయాయి, గత రెండు సంవత్సరాలుగా ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో బ్రతకడం కోసం పార్ట్ టైమ్ రైడర్‌గా రాపిడోలో చేరాడు. ఇలా ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తున్న విషయం తల్లికి చెబితే బాధపడుతుందని ఆమెకు చెప్పలేదు’ అని రాసుకొచ్చాడు.
ఫ్రీలాన్స్ క్రియేటివ్ డైరెక్టర్‌గా చెప్పుకున్న విఘ్నేష్ బిజినెస్ కార్డ్‌ను కూడా పరాగ్ జైన్ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. విఘ్నేష్ తీసిన మినిసిరీస్‌కి లింక్‌ను కూడా షేర్ చేశాడు. పరాగ్ జైన్ విఘ్నేష్ కథను "పీక్ బెంగళూరు" అని కూడా పిలిచాడు. దీంతో ఆన్ లైన్ లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. విఘ్నేష్ కథ చాలా స్ఫూర్తిదాయకమని, ఇలాంటి వ్యక్తులు మన చుట్టూనే ఉంటారని, మొత్తానికి భలై రైడ్.. అంటూ రకరకాలుగా స్పందించారు.