ఎవరైనా ఏదైనా అల్లరి పనులు చేస్తే.. వారిని కోతిలాగా చేశావు అంటారు. కాగా.. నిజంగానే ఓ కోతి భరించలేని అల్లరిచేసింది. ఓ యువకుడి ఫోన్ ఎత్తుకెళ్లి.. దానితో సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం గమనార్హం. ఈ సంఘటన మలేషియాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మ‌లేషియాకు చెందిన‌ జాక్రిడ్జ్ రోడ్జి అనే 20 ఏళ్ల యువ‌కుడు నిద్రపోయి లేచేసరికి ఫోన్ కనిపించడలేదు.  ఎక్కడుందా అని మొత్తం వెతికినా దొరకలేదు. దీంతో.. ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేయాలని అనుకున్నాడు. ఫోన్ లొకేష‌న్‌ను ట్రాక్ చేస్తూ ఇంటికి ద‌గ్గ‌ర్లోని చిట్ట‌డ‌వికి దారి తీశాడు. ఫోన్ కి కాల్ చేస్తూ.. రింగ్ ఎక్కడ వినపడుతుందా అని వెతుక్కుంటూ వెళ్లగా.. ఓ చెట్టు కింద ఫోన్ కనిపించింది.

 

మొబైల్‌లో దొంగ‌ల ఫొటోలు ఉండొచ్చేమో చెక్ చేయ‌మ‌‌ని అత‌డి అంకుల్ స‌ల‌హా ఇచ్చాడు. దీంతో జాక్రిడ్జ్ ఫోన్ ఆన్ చేసి ఫొటోలు చూడ‌గా ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాడు. ఎందుకంటే అందులో ఉన్న దొంగ.. మ‌నిషి కాదు, కోతి. అవును, ఆ దొంగ‌ కోతి ఎన్నో సెల్ఫీలు తీసుకుంది. 

కొన్నిసార్లు ఫోన్‌ను తినేందుకు ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలో కొన్ని ఫొటోలు క్యాప్చ‌ర్ అవ‌గా, మ‌రికొన్ని వీడియోలుగా రికార్డయ్యాయి. వీటన్నంటికి అత‌డు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. కాగా తెరిచిన కిటికీ ద్వారా ఆ కోతి ఇంట్లోకి వ‌చ్చి, త‌న‌ ఫోన్ ఎత్తికెళ్లి  ఉంటుంద‌ని జాక్రిడ్జ్ చెప్పుకొస్తున్నాడు.