తోటి వారితో ఏదైనా తగవు వచ్చినప్పుడో.. లేదంటే ఇంకేదైనా సమస్యను పరిష్కరించుకునేందుకు ఎవరైనా పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి చెప్పిన కారణం విని పోలీసులు ఆశ్చర్యపోయారు.

వివరాల్లోకి వెళితే... భోపాల్‌కు చెందిన కృష్ణకుమార్ దూబే స్థానికంగా ఉండే టైలర్ దగ్గర నిక్కరు కుట్టించడానికి వెళ్లాడు. అయితే అతను సరిగా నిక్కరు కుట్టించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణకుమార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అంతేకాకుండా నిక్కరు సైజును తిరిగి సరిచేసి ఇవ్వమంటే స్పందించడం లేదని పేర్కొన్నాడు. అందుకే స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చిందని వాపోతున్నాడు. నిక్కరు కుట్టడానికి టైలర్‌కి రూ.70 చెల్లించానని దుబే చెప్పాడు.

లాక్‌డౌన్ కారణంగా రెండు పూటలా తిండిలేక ఇబ్బందులు పడుతుంటే.. టైలర్ పనివల్ల తాము మరింత నష్టపోయానని, న్యాయం చేయాలని పోలీసులను వేడుక్కున్నాడు. కృష్ణకుమార్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతనిని స్థానిక స్థానిక కోర్టుకు హాజరు కావాలని సూచించారు.