కుమార్తె మృతదేహాన్ని భుజంపై మోస్తూ.. 10కి.మీ.లు నడుచుకుంటూ... ఓ తండ్రి నిస్సహాయత...

కూతురు మృతదేహాన్ని పది కిలోమీటర్లు భుజంపై మోస్తూ తీసుకెళ్లాడో తండ్రి.. దీనికి ఆస్పత్రి వర్గాల నిర్లక్ష్యమే కారణమంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన మీద విచారణకు ఆదేశించింది..  ఆ రాష్ట్ర ప్రభుత్వం. 

Man carries daughters body on shoulders for 10 km to reach home in Chhattisgarh

అంబికాపూర్ :  ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేక తన కుమార్తె మృతదేహాన్ని భుజంపై మోసుకుంటూ 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన హృదయ విదారక ఘటన ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో చోటు చేసుకుంది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై  రాష్ట్ర ఆరోగ్య మంత్రి విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి  పెడితే…జిల్లాలోని  అందాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ ఏడేళ్ల కుమార్తె అనారోగ్యానికి గురైంది. 

కొద్ది రోజుల నుంచి తీవ్ర జ్వరంతో  బాధపడుతుండటంతో  స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు.  అయినప్పటికీ తగ్గకపోవడంతో శుక్రవారం కాన్పూర్లోని  కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించింది. ఆక్సిజన్ స్థాయిలు 60కి పడిపోయాయి. వైద్యులు చికిత్స అందించినప్పటికీ చిన్నారి ప్రాణాలు దక్కలేదు.  చికిత్స పొందుతూ  నిన్న ఉదయం చిన్నారి మృతి చెందింది.. అయితే, మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఈశ్వర్ దాస్ కుమార్తె మృతదేహాన్ని భుజాన మోసుకొని పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామానికి నడుచుకుంటూ వెళ్ళాడు. 

రోడ్డుపై ఈశ్వర్ నడుచుకుంటూ వెళుతూ ఉండగా కొందరు తీసిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారడంతో  ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్పందించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్ ఘటనపై విచారణకు ఆదేశించారు.  బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది భిన్న వ్యాఖ్యలు చేశారు. అంబులెన్స్ వస్తుందని తాము చెప్పినప్పటికీ ఆ కుటుంబం వినకుండా వెళ్లిపోయిందని రూరల్ మెడికల్ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ భార్గవ్ తెలిపారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. శంకర్ గఢ్ లోని సరూర్ గూంజ్ ప్రాంతానికి చెందిన కల్లు ఒక నిరుపేద దినసరి కూలీ. భార్య తీవ్ర అస్వస్థతకు గురవడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి సిబ్బంది పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పడంతో, మెరుగైన వైద్యం కోసం ప్రయాగ్ రాజ్ లోని స్వరూప్ రాణి నెహ్రు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి ఆమె మరణించింది. 

భార్య శవాన్ని ఇంటికెలా తీసుకెళ్లాలో తెలియని సంకట స్థితి. వాహనం మాట్లాడుకొని 45 కిలోమీటర్ల దూరంలోని తన గ్రామానికి తీసుకెళ్లే ఆర్ధిక స్థోమత అతనికి లేదు. ఆసుపత్రి సిబ్బందిని తనకు ఒక వాహనాన్ని సమకూర్చాల్సిందిగా వేడుకున్నాడు, కానీ ఎటువంటి సహాయం లభించలేదు. భార్య ఆత్మగౌరవాన్ని ఎల్లవేళలా కాపాడుతానని పెళ్లినాడు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చిందేమో కాబోలు, వెళ్లి ఒక రిక్షా తెచ్చాడు. అందులో తన భార్య శవాన్ని పడుకోబెట్టి ఏకంగా 45 కిలోమీటర్ల దూరంలోని తన గ్రామం వరకు లాక్కొని వెళ్ళాడు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios