కరోనా వైరస్ ఎప్పుడు ఏ మూల నుంచి దాడి చేస్తుందో తెలియదు. ఈ మహమ్మారి నుంచి మన ప్రాణాలను రక్షించుకోవాలంటే అందుకు మాస్క్ ధరించడం ఒక్కటే ఉత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

ఎవరైనా ఇంటి నుంచి అడుగు బయటపెట్టాలంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాలంటూ ప్రభుత్వాలు తేల్చి చెబుతున్నాయి. మాట వినని వారిపై భారీ జరిమానాలు విధిస్తున్నాయి. చాలా మంది ఏదో మొక్కుబడిగా మాస్కును ధరిస్తున్నారే తప్పించి నిజంగా తమ రక్షణకే అన్న విషయాన్ని మరిచిపోయారు.

అయితే మాస్క్ పెట్టుకోమని చెబుతున్న తోటి వారిపైనా కొందరు భౌతికదాడులకు దిగుతున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా అచ్చం ఇలాంటి ఘటనే ఐర్లాండ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బెల్జియంలో నివసించే రాబర్ట్ మర్ఫీ బస్సులో ప్రయాణిస్తుండగా.. వెనుకనున్న వ్యక్తి అదే పనిగా ముక్కు చీదుతూనే వున్నాడు. అయితే  మర్ఫీ ఆ వ్యక్తికి దగ్గరకి వెళ్లి మాస్క్ పెట్టుకోమని కోరాడు.

అవతలి వ్యక్తి అతని మాటను మన్నించడంతో పాటు క్షమాపణలు చెప్పి మరీ మాస్క్ ధరించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అదే బస్సులోకి ఓ జంట ఎక్కింది. వారు సరిగ్గా మర్ఫీ ఎదుట కూర్చున్నారు.

వీరిలో యువకుడు మాస్క్ ధరించకపోవడంతో మాస్క్ పెట్టుకోవాలని సూచించాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు వ్యక్తి ఆకస్మాత్తుగా మర్ఫీపై దాడికి దిగాడు. అతని చేతిపై గట్టిగా కొరికి తన ప్రియురాలితో కలిసి బస్సు దిగి పారిపోయాడు.

ఇది చూసి స్పందించిన బస్సులోని తోటి ప్రయాణికులు మర్ఫీని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఆ జంటను గుర్తించి అరెస్ట్ చేశారు.