బాబోయ్... కింగ్ కోబ్రాకు తలస్నానం.. వీడికసలు భయం లేదా?...వైరల్ వీడియో..
ఓ భారీ కింగ్ కోబ్రాకు తలస్నానం చేయించాడో వ్యక్తి. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. ఇప్పుడా వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రాకు ధైర్యంగా స్నానం చేయిస్తున్న విచిత్రమైన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఎప్పుడు, ఎక్కడ తీశారో వివరాలు తెలియదు కానీ.. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన బాత్‌రూమ్‌లో పాము తలమీదినుంచి మగ్గుతో నీళ్లు పోస్తూ స్నానం చేయిస్తున్నాడు. ఆ సమయంలో అతను ఓ చిన్నపిల్లాడికి స్నానం చేయిస్తున్నట్లే ఉన్నాడు కానీ.. ఎలాంటి భయం, ఆందోళన అతనిలో కనిపించలేదు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద X లో షేర్ చేశారు.
వీడియోతో రాసిన క్యాప్షన్ లో ఇలా ఉంది.. "పాముల చర్మమే దానికి రక్షణగా, స్వీయ-శుభ్రతకు తోడ్పడే యంత్రాంగం కలిగి ఉండేదిగా ఉంటుంది. అలాంటప్పుడు కింగ్ కోబ్రాకు స్నానం చేయించడం లాంటి.. నిప్పుతో చెలగాటం ఆడే చర్యలు అవసరమా?’’ అని రాసుకొచ్చారు.
విడాకుల ఊరేగింపు.. అత్తింటినుంచి కుమార్తెను మేళతాళాలతో పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి...
ఈ వీడియో 19-సెకన్ల నిడివితో ఉంది. ఇందులో, బకెట్ లోనుంచి మగ్గుతో నీళ్లను నాగుపాము తలమీదినుంచి పోసి, స్నానం చేయిస్తున్నాడో వ్యక్తి. ఒకానొక సమయంలో, పాము తలను పట్టుకుని ప్రశాంతంగా దాని శరీరాన్ని స్క్రబ్ చేస్తాడు. దీన్ని షేర్ చేసినప్పటినుంచి వీడియో ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది.
10,000 వ్యూస్, వేలాది కామెంట్లతో దూసుకుపోతోంది. ఇది అనవసరమైన చర్య అని ప్రశ్నిస్తునే.. పాముకు స్నానం చేయిస్తున్న అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. భయం లేకుండా అతను చేస్తున్న పనికి స్పందిస్తున్నారు. కొందరు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.అయితే, క్యాప్షన్ లో ప్రశ్నించిన దానికి కూడా కొంతమంది సమాధానం చెబుతున్నారు.
పాముకి స్నానం ఎందుకు అవసరమో ఒక నెటిజన్ చెబుతూ... "పెంపుడు జంతువుల లాగా ఇంట్లో పెంచుకునే పాములు కొన్నిసార్లు తమ చర్మాన్ని పూర్తిగా తొలగించడంలో విఫలమవుతాయి. కొత్తగా వచ్చే చర్మానికి పాత చర్మం అవశేషాలు కలుస్తాయి. ఇది పూర్తిగా తొలగించడానికి మానవ జోక్యం అవసరం. అయితే, పాముకు రక్షణ కల్పించడానికి, లేదా స్నానం చేయించడానికి ఇది సరైన పద్ధతి కాదు"అని చెప్పుకొచ్చారు. "ఈ నాగుపాము విషాన్ని, కోరల్ని పీకేసి ఉంటారు. అందుకే అతను అంత ధైర్యంగా ఉన్నాడని నా అంచనా" అంటూ మరొకరు స్పందించారు.