ప్రేమ ఒక మత్తు లాంటిది... ఆ మైకంలో పడిపోయిన వారికి చుట్టూ ఏం జరుగుతోందో తెలియదు. ఎంతటి వాడు ఎదురొచ్చినా సరే ప్రేమను పండించుకోవాలని చూస్తాడు. అవసరమైతే దేశాల సరిహద్దులను కూడా దాటతారు.

మహారాష్ట్రలో అచ్చం అలాంటి సంఘటనే జరిగింది. వివరాల్లోకి వెళితే... 20 ఏళ్ల సిద్ధిఖి మహమ్మద్ జిషాన్‌కు పాకిస్తాన్‌‌లోని కరాచీకి చెందిన సమ్రా అనే యువతితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది.

తరచుగా వీరిద్దరూ వాట్సాప్, ఫేస్‌బుక్ చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఆమెతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన జిషాన్ ఎలాగైనా తనను నేరుగా కలవాలనుకున్నాడు. ఇంట్లో చెప్పకుండానే పాకిస్తాన్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.

గూగుల్ సాయంతో మహారాష్ట్ర నుంచి గుజరాత్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్దకు చేరుకోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల దూరంలో అపస్మారక స్థితిలో పడివున్న జిషాన్‌ను బీఎస్‌ఎఫ్ సిబ్బంది వివరాల గురించి ఆరా తీశారు.

అతడి పాన్, ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే తమ కుమారుడి ఆచూకీ కోసం జిషాన్ తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో మహారాష్ట్ర పోలీసులు గుజరాత్‌లోని కచ్ జిల్లా పోలీసులకు సమాచారం అందించారు.

ఈ విషయం గురించి బీఎస్ఎఫ్‌కు తెలియజేయగా.. జిషాన్ నుంచి వివరాలు సేకరించి అతడిని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఈ ఘటనపై భద్రతా సంస్ధలు అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరపనున్నట్లు సమాచారం.

కాగా, గతంలో మహారాష్ట్రకు చెందిన హమీద్ అన్సారీ అనే యువకుడు తనకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయి కోసం పాకిస్తాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. అక్రమంగా దేశంలో అడుగుపెట్టాడన్న కారణంతో 2012లో అతనిపై కేసు నమోదు చేయడంతో ఆరేళ్ల తర్వాత విడుదలయ్యాడు.