ఆయన ఓ రోజుకూలీ. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వాళ్లది. ఒక్క పూట కూలీకి వెళ్లకపోయినా.. కుటుంబం మొత్తానికి మూడు పూటలా భోజనం కూడా దొకరదు. అలాంటి వ్యక్తి రాత్రికి  రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒకే ఒక్క లాటరీ అతని జీవితాన్ని మార్చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా రూ.12కోట్లు అతనికి లాటరీలో దొరికాయి. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కేరళ రాష్ట్రం మలూర్ లోని తొలంబ్రా ప్రాంతం పురాలీమాల కైతాంచల్ కురీచియ కాలనీకి చెందిన పేరూనన్ రాజన్(58) ఓ రూజు కూలీ. దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక సమస్యలతో అల్లాడే అతనికి లాటరీలు కొనే అలవాటు ఉంది. ఒక్కసారైనా అదృష్టం తన తలుపుతట్టదా అనే ఆశతో లాటరీలు కొనేవాడు.

Also Read బీచ్ లో బికినీ వేసిన మహిళ.. లాక్కెళ్లిన పోలీసులు, వీడియో వైరల్...

అతని ఆశే నిజమైంది. అతను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. రాజన్ కొన్న లాటరీ టికెట్టుకు కేరళ క్రిస్టమస్ బంపర్ లాటరీ రూ.12కోట్లు దక్కాయి. తనకే బంపర్ లాటరీ లభించిందని తెలుసుకున్న రాజన్ షాక్ కు గురయ్యారు. తనకే ఇంత పెద్ద లాటరీ వస్తుందని ఊహించలేదని రాజన్ ఉద్వేగంగా చెప్పారు. లాటరీ వచ్చాక రాజన్ తన భార్య రజనీ, కుమారుడు రిజిల్, కుమార్తె అక్షరలతో కలిసి కన్నూర్ జిల్లా సహకార బ్యాంకుకు వచ్చి అక్కడి అధికారులకు టికెట్ అప్పగించారు.

కూతుపరంబ పట్టణంలో తాను లాటరీ టికెట్టు కొన్నానని, ముందుగా ఈ లాటరీ డబ్బులతో తనకున్న అప్పులు తీరుస్తానని రాజన్ చెప్పారు. రూ.12 కోట్ల లాటరీకి గాను పన్నులు పోను తనకు రూ.7.2 కోట్లు వస్తాయని, ఆ డబ్బుతో తనకు గతం సహాయపడిన వారికి తాను సాయం చేస్తానని రాజన్ చెప్పారు. చెమట చిందించి సంపాదించే తనకు డబ్బు విలువ తెలుసునని, అందుకే ఈ లాటరీ డబ్బును వృథా చేయనని రాజన్ వివరించారు.