ఇప్పటి వరకు అందరూ గూగుల్ మ్యాప్ ని అడ్రస్ కోసం మాత్రమే వాడి ఉంటారు. తమకు తెలియని కొత్త ప్రాంతానికి వెళ్తున్నప్పుడు గూగుల్ మ్యాప్  సహాయంతో వెళ్తుంటారు. అయితే... ఓ వ్యక్తి మాత్రం ఈ గూగుల్ మ్యాప్స్ మరో కొత్త విషయానికి వాడుకున్నాడు. భార్య అక్రమ సంబంధాన్ని కనిపెట్టడానికి వాడుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలోని పెరూ రాష్ట్ర రాజధాని లిమాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. లిమా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గూగుల్ మ్యాప్ తెరిచి స్ట్రీట్ వ్యూ చూశాడు. అంతలో వీధిలోని ఓ బల్లపై ఓ మహిళ తన ప్రియుడితో సరసాలాడుతూ కనిపించింది.ఎవరై ఉంటారబ్బా అన్న ఆసక్తితో కాస్త జూమ్ చేసి చూశాడు. ఇంకేముంది అతని గుండె గుభేల్ మంది. ఎందుకంటే.. అక్కడ ఉన్నది మరెవరో కాదు అతని భార్యే.

వెంటనే తేరుకొని.. తన భార్య ప్రేమకలాపాలను స్క్రీన్ షార్ట్స్ తీసుకున్నాడు. తర్వాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన భార్యకు ఆ ఫోటోలు చూపించాడు. తొలుత ఆమె.. అక్కడ ఉన్నది తాను కాదని నమ్మించే ప్రయత్నం చేసింది. అతను నమ్మకపోయేసరికి తాను చేసిన తప్పుని అంగీకరించింది. 

కాగా.. తన భార్య తనను మోసం చేసి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే కారణం చూపించి వెంటనే అతను విడాకులు పొందడం గమనార్హం. కాగా... ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.