భార్య రన్నరప్‌గా నిలిచిందని ఆగ్రహం.. అందాల పోటీ విజేత కిరీటాన్ని నేలకేసి కొట్టి, ధ్వంసం చేసిన భర్త...
తన భార్యను రన్నరప్ గా ఎంపికచేయడంతో కోపానికి వచ్చిన ఓ భర్త.. అందాల పోటీ విజేత కిరీటాన్ని నేలకేసి కొట్టి ధ్వంసం చేశాడు. ఈ ఘటన బ్రెజిల్‌లోని ఎల్‌జిబిటిక్యూ+ అందాల పోటీలో చోటుచేసుకుంది.
బ్రెజిల్ : మిస్ గే మాటో గ్రోస్సో 2023 పోటీల్లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దీంతో కిరీటం గెలుచుకున్న ఆనందం ఆ విజేతకు లేకుండా పోయింది. అందాల పోటీల్లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ భర్త వేదికపైకి ఎక్కి విజేత నుంచి కిరీటాన్ని లాక్కొని నేలకేసి కొట్టాడు. దీనికి కారణం తెలిస్తే ముక్కుమీద వేలేసుకుంటారు. అతని భార్య రన్నరప్ గా నిలవడమే. ఆమె విజేత కాలేదన్న అక్కసుతో ఇలా చేశాడు.
LGBTQ+ అందాల పోటీలు శనివారం బ్రెజిల్‌లో జరిగినట్లు స్థానిక వార్తా సంస్థ గ్లోబో తెలిపింది. ఈ వీడియోను పోటీకి హాజరైన ఎవరో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. వైరల్ వీడియోలో ఇద్దరు ఫైనలిస్టులు నతల్లి బెకర్, ఇమాన్యుయెల్లీ బెలిని వేదికపై ఉన్నారు. విజేతను ప్రకటించడానికి అంతకుముందు సంవత్సరపు విజేత.. కిరీటం పట్టుకుని వచ్చింది. ఇద్దరిలో ఎవరో విజేత తేల్చే ముందు కాస్త టెన్షన్ పెడుతూ.. కిరీటాన్ని ఇద్దరి మీదికి అటూ, ఇటూ తిప్పింది.
చివరకు విజేతగా బెలిని ఎంపికయిందని.. ప్రకటించి ఆమె తలపై కిరీటాన్ని పెట్టబోయింది. ఇంతలో రన్నరప్‌గా నిలిచిన కంటెస్టెంట్ భర్త వేదికపైకి హఠాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక్కసారిగా కిరీటాన్ని మహిళ చేతుల్లోంచి లాక్కొని స్టేజి ఫ్లోర్‌పై పడేశాడు. అక్కడ ఉన్న ప్రేక్షకులు షాక్‌తో ఊపిరి పీల్చుకోవడంతో అతను అరుస్తూ తన భార్యను లాగడం కూడా కనిపించింది. అక్కడితో అయిపోలేదు. అతను కిరీటాన్ని మరోసారి ఎత్తి నేలకేసి కొట్టాడు.
"ఈ ప్రకటన అన్యాయంగా భావించాడు. దీంతో మాకు ఈ అసౌకర్యం, నష్టాన్ని కలిగించాడు" అని పోటీ సమన్వయకర్త మలోన్ హెనిష్ తరువాత విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. "ఎన్నికైన విజేతకు కిరీటం పెట్టనివ్వకుండా రన్నరప్ గా నిలిచిన మిస్ కుయాబా భాగస్వామి వేదికపైకి దాడి చేసి కిరీటాన్ని ధ్వంసం చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం" అన్నారాయన.