కేటుగాళ్లు ఏ రకంగానైనా సరే.. చుట్టుపక్కల వారిని మోసం  చేసి పబ్బం గడుపుకుంటూ ఉంటారు. అయితే అది అన్ని సమయాల్లో కుదరదు. తాజాగా ఓ మోసగాడు నకిలీ చెక్‌తో అడ్డంగా బుక్కయ్యాడు.

వాల్టన్ కౌంటీ షెరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాసీ విలియం కెల్లీ అనే వ్యక్తి డెస్టిన్‌లోని పోర్షే కారు డీలర్‌షిప్ వద్ద జూలై 27న 1,39,203 డాలర్ల నకిలీ చెక్‌ను ఇచ్చి దర్జాగా పోర్షే 911 టర్బోను తీసుకెళ్లాడు.

అయితే కెల్లీ ఇచ్చిన చెక్ చెల్లకపోవడంతో డీలర్ ఒకలూసా కౌంటీ షరీఫ్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చెల్లని చెక్కుతో పోర్షే కారును సొంతం చేసుకున్న కెల్లీ ఆకారుతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

అదే కారులో మిరమర్ బీచ్‌లోని ఓ ఆభరణాల దుకాణానికి వెళి 61,521 డాలర్లకు మరో నకిలీ చెక్ ఇచ్చి రోలెక్స్ వాచీలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే చెక్ నగదుగా మారే వరకు ఆ దుకాణం వారు వాచ్‌లను తమ వద్దే వుంచుకున్నారు.

చెక్ చెల్లకపోవడంతో వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ చెక్‌లతో మోసగించిన కెల్లీని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తాను ఇంట్లో కంప్యూటర్ నుంచి ఈ చెక్కులను ప్రింట్ చేశానని నేరాన్ని అంగీకరించాడు. అనంతరం నిందితుడిని వాల్టన్ కౌంటీ జైలుకు తరలించారు.