సాధారణంగా బావి అంటే ఇంటి బయట ఏ ఈశాన్యం మూలనో తవ్వుతారు. కానీ ఓ ఇంటిలోపల... అది కూడా బెడ్‌రూమ్‌లో బావిని తవ్వారు. వినడానికి ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజం.

వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కనెక్టికట్‌ సమీపంలోని గిలీఫోర్డ్ పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. ఓ వ్యక్తి నూతిలో పడిపోయాడని.. రక్షించాలని అవతలి వైపు వ్యక్తి చెప్పాడు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.

కానీ, అక్కడ బావి ఎక్కడా కనిపించలేదు. ఫిర్యాదు చేసిన వ్యక్తి పోలీసులను ఇంటి లోపలికి రావాలని తెలిపాడు. ఇతనేంటీ ఇంట్లోకి రమ్మంటున్నాడని పోలీసులు ఆశ్చర్యపోయారు. తీరా లోపలికి వెళ్లగానే ఇంట్లో బావి వుంది.

పైగా అది 30 అడుగుల లోతులో ఉంది. నూతిలో పడిపోయిన బాధితులు ఆ ఇంట్లోకి కొత్తగా అద్దెకు వచ్చిన వ్యక్తి స్నేహితుడు. బెడ్రూమ్‌లో సామాన్లు సర్దుతున్న సమయంలో ఫ్లోర్ ఒక్కసారే విరిగింది.

దీంతో అతడు నేరుగా 30 అడుగుల లోతున్న బావిలో పడిపోయాడు. అందులో సుమారు 6 అడుగుల పైన నీళ్లు ఉన్నాయి. దీంతో బాధితుడు ఆ బావిలో నరకయాతన అనుభవించాడు.

చిమ్మ చీకట్లో భయం భయంగా కాలం గడిపాడు. సుమారు 25 నిమిషాలు వరకు అతడు అందులోనే ఉన్నాడు. లోతు ఎక్కువగా ఉండటంతో వారి వద్ద ఉన్న తాళ్లు, సిబ్బంది సామర్ధ్యం సరిపోలేదు.

దీంతో మరొక టీమ్‌ అక్కడికి వచ్చి, నడుముకు తాడు కట్టుకుని బావిలోకి దిగి.. బాధితుడిని బయటకు తీసుకొచ్చారు. అసలు ఆ ఇంట్లోకి బావి ఎలా వచ్చిందని పోలీసులు ఆరా తీశారు. సదరు ఇంటిని 1843లో నిర్మించారని, అప్పుడు ఆ బావి ఇంటికి బయటే ఉండేదని తెలిసింది.

1981లో ఆ ఇంటికి మరమ్మత్తులు చేశారు. ఆ సమయంలో గదులను విస్తరించారు. దీనిలో భాగంగా బావిపై గదిని నిర్మించారు. అయితే, బావిని పూడ్చకుండా.. సాధారణ చెక్క ఫ్లోరును ఏర్పాటు చేశారు. కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరడంతో.. అతడు నిలుచున్న చోటే విరిగిపోయింది.