పాడి రైతులకు ఆవులు, గేదెలు అంటే అమితమైన అభిమానం ఉంటుంది. మన దేశంలో అయితే.. ఆవును దేవతగా పూజిస్తూ.. ఇంట్లో ప్రేమగా చూసుకుంటారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం ఆవు పై అంతకుమించిన ప్రేమ చూపించారు. గాయంతో నడవలేకపోతున్న ఓ గోమాత కోసం ఏకంగా హెలికాప్టర్ రప్పించాడు. ఈ సంఘటన స్విట్టర్లాండ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ రైతుకి తాను పెంచుకుంటున్న ఆవు అంటే చాలా ఇష్టం. అది ఇబ్బందులు పడితే తట్టుకోలేడు. ఆవు మీద ఆ రైతుకు ఉన్న ప్రేమే ఆయనకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. స్విస్‌ ఆల్ప్స్‌లోని ఓ పర్వతంలో ఆహారానికి వెళ్లి ఆ ఆవు గాయపడి కుంటుతూ నడుస్తుండడాన్ని రైతు గమనించాడు. 

అది అలాగే నడుస్తూ వెళ్తే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉందని, హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయించాడు. సహాయక సిబ్బంది వచ్చి గోవుకి తాళ్లు కట్టి హెలికాప్టర్‌ ద్వారా పైకి లేపి పర్వతాల్లోంచి బయటకు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైర ల్‌ అయింది. ఆ రైతుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.