సారాంశం

ఓ ఏనుగు తనను విడిచి మావటి వెళ్లడాన్ని తట్టుకోలేకపోయింది. అతడిని ఆపడానికి సర్వవిధాలా ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

జంతువులు, మనుషుల మధ్య అనుబంధం హృద్యంగా ఉంటుంది. ఇళ్లలో పెంచుకునే పెంపుడు జంతువులు కాస్త విరామం తరువాత యజమాని కనిపించగానే సంతోషంతో చెంగుచెంగునా ఇళ్లంతా పరుగులు పెడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి. తమని విడిచిపెట్టి వెడుతున్నారంటే బాధతో అలుగుతాయి. మూగజీవాలకు తమను ప్రేమగా చూసుకునేవారిపట్ల ఉండే అనురాగం అది.

అలాంటి ఓ అపురూపమైన ఘటనకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ ఆకారంలో కనిపించే ఏనుగులో ఎమోషన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. కోపం అయినా.. ప్రేమ అయినా అంతే స్థాయిలో చూపిస్తుంది. ఏనుగు, దాని మావటికి మధ్య ఉన్న విశేషమైన బంధాన్ని చూపించే హృదయాన్ని కదిలించే వీడియో ఇంటర్నెట్‌లో అందర్నీ ఆకట్టుకుంటోంది. 

హిందూ విద్యార్థిని చెంపదెబ్బ కొట్టమని ముస్లిం విద్యార్థికి సూచించిన టీచర్.. అరెస్ట్..

ఈ వైరల్ వీడియోలో ఏనుగుకు దాని సంరక్షకుడితో ఉన్న కాదనలేని అనుబంధాన్ని చూపిస్తోంది. వీడియోలో, ఏనుగు తన తొండం, తోకలతో మావటిని తన ఇంటికి పోనివ్వకుండా అడ్డుకోవడం.. చూసేవారిని అబ్బురపరుస్తుంది. వారి హృదయాలు ద్రవించేలా చేస్తుంది. బండిమీద కూర్చున్న అతడిని కిందికి దింపడం.. పోనివ్వకుండా తనతోనే ఉండాలని గారాలు పోవడం.. అబ్బురంగా కనిపిస్తుంది. 

ఈ వీడియోను అనంత్ రూపనగుడి అనే ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ (IRAS) అధికారి ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ, రూపనగుడి..  "ఏనుగు, దాని సంరక్షకుడి మధ్య అనుబంధం -  అతడిని వెళ్లనివ్వడం లేదు" అని క్యాప్షన్ పెట్టాడు. 

ఏనుగు తన సంరక్షకుడిని ఆలింగనం చేసుకోవడం.. అతడు తననుండి విడిపోవడానికి ఇష్టపడకపోవడం చూసేవారిని అబ్బురపరుస్తుంది. కాసేపటికి కేర్‌టేకర్ ఏనుగు నుంచి తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ వెంటనే తేరుకున్న గున్నఏనుగు పరుగు పరుగున వెళ్లి తన తొండంతో అతడిని స్కూటర్ ఎక్కకుండాదింపేస్తుంది. సంరక్షకుడు తనతోనే ఉండేలా చూసుకోవడానికి ఏనుగు తన తోకను కూడా ఉపయోగిస్తుంది.

తర్వాత, కేర్‌టేకర్ చివరకు తన స్కూటర్‌పై వెళ్లడానికి ప్రయత్నించాడు.  కానీ ఏనుగు వెంటనే అతని వైపు పరుగెత్తి వాహనాన్ని ఆపింది. దీంతో వీడియో మరింత ఆసక్తికరంగా మారింది. ఏనుగు తన సంరక్షకుడిని ఆలింగనం చేసుకున్న వైరల్ వీడియో సెప్టెంబర్ 27న ఆన్‌లైన్‌లో కనిపించింది. అప్పటి నుండి, ఈ వీడియో 21వేలకు పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది.