అమ్మాయి పుట్టిందని సంతోషం.. హెలికాప్టర్ లో ఇంటికి తీసుకువెళ్లిన తండ్రి.. వీడియో వైరల్...
ఆడపిల్ల పుట్టిందని సంతోషంతో ఉప్పొంగిపోయారు ఆ తల్లిదండ్రులు. దశాబ్దాల తరువాత తమ వంశంలో పుట్టిన ఆడపిల్లకు వినూత్నంగా స్వాగతం పలకాలనుకున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి ఏకంగా హెలికాప్టర్ లో తీసుకువెళ్లారు.
మహారాష్ట్ర : పుట్టేది Baby Girl అని తెలిస్తే కడుపులోని పిండాని చిదిమేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఆడపిల్ల పుట్టిన తర్వాత చంపడం, చెత్తకుప్పలో పడేసిన దారుణాల గురించి కూడా ఎన్నో వింటున్నాం. ఆడపిల్లగా పుట్టి సమాజంలోచిన్నచూపుకు గురవుతున్నవారు ఎందరో. సమాజంలో ఎంత మార్పు వచ్చినా.. ఎంత అభివృద్ధి చెందినా అమ్మాయిల మీద వివక్ష విషయంలో మాత్రం అనుకున్నంత మార్పు రావడం లేదు. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పరిస్థితి కాస్త మారింది. పుట్టబోయేది ఎవరైనా సరే తల్లిదండ్రులు వారిని సంతోషంగా పెంచిపెద్ద చేస్తున్నారు. తాజాగా కూతురు పుట్టింది అన్న సంతోషంలో ఓ కుటుంబం ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆస్పత్రి నుంచి ఇంటికి ఆహ్వానించేందుకు వినూత్నంగా ఆలోచించింది.
లక్ష రూపాయలు ఖర్చుపెట్టి హెలికాప్టర్తో స్వాగతం పలికింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పూణే జిల్లాలోని ఖేడ్ పట్టణానికి చెందిన విశాల్ జరేకర్ అనే న్యాయవాదికి జనవరి 22న పాప పుట్టింది. బోసారి పట్టణంలో జన్మించిన ఆ పాపకు రాజ్యలక్ష్మి అని నామకరణం చేశారు. కాగా, విశాల్ కుటుంబంలో చాలా ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది. దీంతో చిట్టితల్లి ఇంటికి తీసుకు వచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావించారు. చిన్నారిని ఖేడ్ లోని ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ ను బుక్ చేశారు. ఇందుకోసం లక్ష రూపాయలు ఖర్చు చేశారు ఇంటి దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సరైన స్థలం లేకపోవడంతో వ్యవసాయ క్షేత్రంలో హెలికాప్టర్ ల్యాండ్ చేశారు.
అలా హెలికాప్టర్ ద్వారా విశాల్ తన కూతురి ఇంటికి తీసుకువెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అమ్మాయి తండ్రి విశాల్ మాట్లాడుతూ ఇంట్లో ఆడపిల్ల పుట్టడం పండుగలాగా జరుపుకోవాలనే సందేశాన్ని సమాజానికి ఇచ్చేందుకు ఈ విధంగా చేసినట్లు తెలిపారు. ఆడపిల్ల పుడితే భారంగా భావించే మనుషులకు విశాల్ ఆదర్శంగా నిలిచాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.