భూమి మీద నూకలు వుంటే రెప్పపాటులో మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు. కర్ణాటకలో అచ్చం అలాంటి ఘటనే జరిగింది. శరీరం మీదుగా కారు వెళ్లినప్పటికీ ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది.

వివరాల్లోకి వెళితే... మంగళూరు నగరంలోని కాద్రి కంబ్లా జంక్షన్ గుండా స్కూటర్‌పై వెళ్తున్న వాణిశ్రీ అనే మహిళను ఓ కారు అడ్డుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆమె ఎగిరి కారు బానెట్‌పై పడింది.

అంతేకాకుండా కారు వేగానికి కిందపడిపోయింది. ఈ పరిణామానికి కంగారుపడిపోయిన కారు డ్రైవర్ ఆమె మీదుగానే కారును పోనిచ్చాడు. దీంతో కారు వాణిశ్రీ మీదుగానే వెళ్లింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై కారును అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

డ్రైవర్ కారు నిలపడంతో స్థానికులు వెంటనే కారుని అమాంతం పైకెత్తి మహిళను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. వాణిశ్రీకి ఎలాంటి అపాయం లేదని, స్వల్పగాయాలే తగిలాయని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.