పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన పలువురు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తారు. లక్ ఉండాలే  కానీ ఎంతటి ప్రమాదం నుంచైనా బతికి బట్టకట్టవచ్చు. అచ్చం ఇలాంటి సంఘటనే ఫ్రాన్స్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. గ్రెనోబుల్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. దానిలో నివసించే వాంరంతా భయాందోళనలకు గురవుతూ బయటకు పరుగులు తీశారు. ఇదే సమయంలో మూడో అంతస్తులోని ఓ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు.

తల్లిదండ్రులిద్దరూ బయటకు వెళ్తూ పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లారు. వీరిలో ఒకడి వయసు పదేళ్లు కాగా, చిన్నోడి వయసు మూడు సంవత్సరాలు. పిల్లల వద్ద మరో తాళం చెవి కూడా లేకపోవడంతో... కానీ సమయం మించి పోతుండటంతో అపార్ట్‌మెంట్‌ని మంటలు కమ్మేశాయి.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పెద్దలకే ఏం చేయాలో తెలియదు. అలాంటి ఈ పిల్లల పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకొండి. దీనికి తగ్గట్టుగానే పిల్లలు సైతం చాలా భయపడ్డారు.

కానీ ప్రాణాలు రక్షించుకోవాలనే ఎలాంటి ఆలోచన లేకుండా దాదాపు 40 అడుగుల పై నుంచి ఒకరి తర్వాత ఒకరు కిందకు దూకేశారు. అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక బృందాలు అప్పటికే.. కింద సిద్దంగా ఉండటంతో ఒడిసి పట్టుకున్నారు.

అంత పై నుంచి దూకినప్పటికీ, పిల్లలిద్దరికీ ఒక్క దెబ్బ కూడా తగలకపోవడం విశేషం. అయితే పొగతో ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. దీనిని చూసినవారు చిన్నారులిద్దరూ చాలా అదృష్టవంతులంటూ చుట్టూ ఉన్న వారు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.