పీరియడ్ నొప్పితో బాధపడుతున్న క్లాస్‌మేట్ కోసం శానిటరీ న్యాప్‌కిన్‌లు ఐస్‌క్రీం కొన్న అబ్బాయి.. వైరల్..
పీరియడ్ పెయిన్ తో బాధపడుతున్న సహ విద్యార్థికోసం ఓ అబ్బాయి శానిటరీ నాప్ కిన్స్ తో పాటు ఐస్ క్రీం కొనిచ్చాడు. ఆ అబ్బాయి చేసిన పని మీద నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు.
నెలవారీ పీరియడ్ సమయంలో నొప్పి.. మూడ్ స్వింగ్స్ ఎంత భయంకరంగా ఉంటాయో.. అమ్మాయిలకే తెలుస్తుంది. దాన్ని అర్థం చేసుకుని వారికి సహయపడే పురుషులు నేటి కాలలో పెరుగుతున్నారనే చెప్పాలి స్వయంగా నాప్ కిన్స్ కొని తీసుకురావడం.. వారి మూడ్ స్వింగ్స్ కు, పెయిన్ ను కంట్రోల్ చేయడానికి తమవంతుగా చేయాల్సింది చేయడం చేస్తున్నారు. నేటి తరం అబ్బాయిలు.. అలాంటి ఓ చిన్న ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
ఓ అబ్బాయి.. తన క్లాస్ మేట్ పీరియడ్ నొప్పితో ఇబ్బంది పడడం గమనించాడు. వెంటనే ఆమెకు నాప్ కిన్స్ తో పాటు, ఐస్ క్రీం కూడా కొనిచ్చాడు. ఆ విషయాన్ని స్వయంగా ఆ అమ్మాయే ట్విట్టర్ లో స్టోరీ షేర్ చేసింది. అదిప్పుడు వైరల్ గా మారింది.
ఆయుష్క అనే అమ్మాయి ఓ ట్రైనింగ్ క్లాసుకు కొత్తగా వెళ్లింది. అక్కడ హఠాత్తుగా ఆమెకు పీరియడ్స్ వచ్చాయి. ఆ సమయంలో ఆమె దగ్గర శానిటరీ న్యాప్‌కిన్‌లు లేవు. ఒక్కోసారి ఇలాంటి ఇబ్బంది ప్రతీ అమ్మాయికి ఏదో సందర్భంలో ఎదురవుతూనే ఉంటుంది. దీంతో ఆమె నొప్పితో ఇబ్బంది పడుతోంది.
ఆ ఊరు, క్లాసు కూడా కొత్త.. తనకు ఎవ్వరూ తెలియకపోవడంతో ఏం చేయాలో తోచలేదు. కాస్త దూరంగా ఉన్న అమ్మాయికి చెప్పడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు. ఇంతలో ఆమె పక్కన కూర్చున్న ఓ అబ్బాయి.. ఆమె ఏదో ఇబ్బంది పడుతుందన్న విషయం గమనించాడు.
ఏదైనా సహాయం కావాలా? అని అడిగాడు. ఆ అమ్మాయి కూడా మొహమాట పడలేదు. విషయం చెప్పింది. దగ్గర్లో ఏదైనా మెడికల్ షాపు ఉందా? అని అడిగింది. వెంటనే ఆ అబ్బాయి.. ఫోన్లో వెతికి.. బ్రేక్ టైంలో తనతో రమ్మని చెప్పాడు. ఆ తరువాత.. అలా తీసుకెళ్లి.. నాప్ కిన్స్.. వాటితో పాటు ఆమె నొప్పికి కాస్త ఉపశమనంగా, మూడ్ బాగుచేయడానికి వీలుగా ఓ ఐస్ క్రీం కూడా కొని తెచ్చాడు.
అది చూసి.. ఆమె ఆశ్చర్యపోయింది. అతని చర్యకు తీవ్రంగా కదిలిపోయింది. ఈ విషయాన్నే ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆమెకు రూట్ చెప్పి ఒంటరిగా పంపించే బదులు, వారి బ్రేక్ టైంలో అబ్బాయి ఆమెతో వెళ్ళాడు... అదే ఆమె చెబుతూ.. "ఈ నగరం, వీరి ప్రేమలో పూర్తిగా పడిపోయాను’ అంటూ ఆయుష్క అనే ట్విట్టర్ యూజర్ స్టోరీ షేర్ చేసింది.
ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయ్యింది. ఏ ఊరో చెప్పమంటూ కొందరు, అబ్బాయిలు ఎప్పుడూ ఇలాగే ఉంటారని మరికొందరు.. పోనీలే ఒక్కసారైనా అబ్బాయిల గురించి పాజిటివ్ గా విన్నాం.. అని ఇంకొందరు.. చదవడానికి చాలా బాగుంది. ప్రపంచం మంచిగా ఎలా మారుతుందో చూసి నేను సంతోషిస్తున్నాను.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే అందరూ ఆ అబ్బాయి చేసిన పనిని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన జైపూర్ లో జరిగినట్టుగా తెలుస్తోంది.