బాబోయ్... షూలో దాక్కున్న నాగుపాము పిల్ల.. వేసుకోబోతే పడగవిప్పి కాటేయబోతూ..
షూలో నాగుపాము పిల్ల ఉన్న ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వర్షాకాలం కావడంతో ఈ పాము పిల్ల వెచ్చదనం కోసం షూలో చొరబడింది.
కర్ణాటక : కర్ణాటకలో వెలుగు చూసిన ఓ ఘటన ఇప్పుడు అందరిని ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేస్తోంది. కర్ణాటకలోని ధార్వాడలోని హొస యల్లాపుర మేదార వీధిలో షూలో నాగుపాము పిల్ల ఉండడం ఆ కుటుంబాన్ని భయాందోళనలకు గురి చేసింది. నందిత, శివగౌడ అనే దంపతులు ఆ ఇంట్లో ఉంటున్నారు. వారు ఇంటి బయట షూస్ వదిలారు. తెల్లవారి ఆ షూలో నాగుపాము పిల్ల తలెత్తి చూస్తుండడం గమనించి తీవ్రభయాందోళన గురయ్యారు.
ఉదయం పూట బయట ఊడుస్తున్న సమయంలో షూస్ ను జరపబోగా అందులో పాము పిల్ల ఉన్నట్లు నందిత గమనించింది. వెంటనే విషయాన్ని భర్తకు తెలిపింది. ఆయన వెంటనే పాములను పట్టే యల్లప్ప జోడల్లికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. వారి ఇంటికి చేరుకున్న యల్లప్ప ఆ పాము పిల్లను జాగ్రత్తగా షూలో నుండి బయటకు తీశారు. ఒకవేళ చూడకుండా వేసుకున్నట్లయితే కాటు వేసేదని.. షూ వేసుకునే సమయంలో ఒకసారి అందులో ఏమైనా ఉందేమో తప్పనిసరిగా గమనించాలని ఆయన సూచించారు.
మహారాష్ట్రను ముంచెత్తిన వరదలు.. భారీ వర్షాలు కురుస్తాయంటూ గుజరాత్ కు ఐఎండీ రెడ్ అలర్ట్
ముఖ్యంగా ఇంటి చుట్టూ చెట్లు, పొదలు ఉన్నవారు తప్పనిసరిగా ఇలాంటివి గుర్తించుకోవాలని అన్నారు. వర్షాకాలం వల్ల చెట్లు, పొదల్లో ఉన్న పాములు, కీటకాలు జనావాసాల్లోకి వస్తుంటాయని ఇలా వచ్చినవి వెచ్చగా సురక్షితంగా ఉండే ప్రాంతాల్లో తలదాచుకోవడానికి ప్రయత్నిస్తాయని అన్నారు. ఆ క్రమంలోనే షూస్, పాత సామాన్లు అలాంటి వాటిల్లో చొరబడుతుంటాయని.. వాటిని వాడేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ఐదు రోజుల క్రితం కర్ణాటకలో ఇలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది. కర్ణాటకలోని మంగళూరులో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగు చూసింది. ఓ నాగు పాము ప్లాస్టిక్ డబ్బాను మింగింది. ఇది గమనించిన కొంతమంది ఆ పామును వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లగా.. ఆపరేషన్ చేసి డబ్బాను తొలగించారు.
ఆ తర్వాత పాము కోలుకున్నాక అటవీ విభాగంలో విడిచిపెట్టారు. కర్ణాటక మంగలూరులోని బంట్వాళ దగ్గరలో ఉన్న వగ్గలో సాలుమరద తిమ్మక్క ఉద్యానవనంలో ఈ పాము అచేతనంగా పడి ఉంది. దాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ‘స్నేక్ కిరణ్’ అనే వన్యప్రాణిప్రేమికుడు ఆ పామును పట్టుకుని చూశారు. ఈ క్రమంలో అదేదో గట్టి పదార్థాన్ని మింగిందని గుర్తించారు.
దానివల్లే ఇబ్బంది పడుతుందని గుర్తించి... వెంటనే మంగళూరులోని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. స్కానింగ్ లో చేశారు. అందులో పాము కడుపులో ప్లాస్టిక్ డబ్బా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే డాక్ట్ యశస్వి నారావి ఆ పాముకు ఆపరేషన్ చేశారు. దాని శరీరంలో ఉన్న డబ్బాను తీసేశారు. ఆపరేషన్ తరువాత పాము త్వరగా కోలుకుంది. దీంతో దాన్ని సమీప అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.