చిల్డ్రన్స్ డే 2022 : ఇవి కూడా పిల్లలే... కోతిపిల్లతో బాతుపిల్లల ఆట.. ఫిదా అవుతున్న నెటిజన్లు...
కోతిపిల్లతో బాతుపిల్లల ఆట.. ఎంత ముద్దుగా ఉందో.. బాలల దినోత్సవం సందర్భంగా ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.
నవంబర్ 14 భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు.. ఈ రోజునే దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. సృష్టిలో అత్యంత అందమైనది పిల్లల చిరునవ్వు, వారి ముద్దుమాటలు. వాటిని వింటే.. ఆ చిరునవ్వును ఆస్వాదిస్తే ఎలాంటి టెన్షన్ అయినా ఇట్టే ఎగిరిపోతుంది. అమాయకంగా చిట్టి చిట్టి చేతలతో సంతోషపెట్టడం వారికే సాధ్యం. అందుకే ఇంటర్నెట్ లో పిల్లల అడోరబుల్ వీడియోలకు చాలా వ్యూస్ వస్తాయి.
ఇక ఈ కోవలో చిన్నపిల్లల వీడియోలతో పాటు.. పిల్లజంతువుల వీడియోలు కూడా చాలా ఆకట్టుకుంటాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. బాలల దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌లో, ఐదు బాతుపిల్లలు, ఒక కోతి పిల్ల ఉన్నాయి. ఇవి రెండూ ఆడుకుంటూ.. కిందా, మీదా పడుతూ.. పరుగులెత్తుతూ తెగ అల్లరి చేస్తున్నాయి.
వీడియో ప్రారంభంలో, ఈ బాతుపిల్లలు, కోతిపిల్ల అన్నీ గడ్డిపై కూర్చుని కొమ్మలను తింటున్నట్లు కనిపిస్తాయి. చివరికి అవన్నీ ఎగురుతూ, దూకుతూ.. తిర్లమర్లు పడుతూ పరుగెత్తుతాయి. మరోసారి రెండు బాతుపిల్లలు.. చిట్టి కోతిపై నిద్రిస్తుండడం కనిపిస్తుంది. పడుకున్న కోతిపిల్లను తమ ముక్కులతో పొడుస్తూ లేపడానికి ప్రయత్నించడం.. తరువాత అన్నీ ఒకదానిమీద పడి ఒకటి పడుకోవడం.. చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. ఈ మొత్తం క్లిప్ చూస్తే.. చిన్నతనంలో మనం చేసిన సరదా అల్లరిని గుర్తు చేస్తుంది.
ఈ 23-సెకన్ల వీడియో చూసిన ప్రతీ ఒక్కరి మొహంలో నవ్వులు పూయిస్తోంది. "ప్రపంచంలో అత్యంత విలువైనది పిల్లల ముఖంలో చిరునవ్వు. అందరికీ సుందరమైన బాలల దినోత్సవం" అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. పోస్ట్ చేసినప్పటి నుండి ఈ వీడియో 4,000 వీక్షణలు, 467 లైక్‌లను పొందింది.
దీనిమీద రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక యూజర్ మాట్లాడుతూ.. "ఎంత అద్భుతమైన అందమైన దృశ్యం, ధన్యవాదాలు! దేవుడు ఈ మనోహరమైన, అమాయకమైన జీవులను ఆశీర్వదిస్తాడు, ప్రకృతిలోని అందమైన దృశ్యం ఇది..’’ అని కామెంట్ చేస్తే.. మరొక వ్యక్తి... "అద్భుతంగా ఉన్నాయి, బాతుపిల్లలు, కోతి ఒకదానికొకటి ఎలా ఆప్యాయంగా ఉన్నాయి. మీ వీడియోకి చాలా ధన్యవాదాలు.""దీనివల్ల మన చుట్టూ సంతోషకరమైన వైబ్స్ అల్లుకుంటాయి" అని మరో వినియోగదారు చెప్పారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇది చూడడం ఓ మంచి వైద్యంలా పనిచేస్తుందని కామెంటాడు.