హిట్లర్.. ఈ మూడు అక్షరాల గురించి తలచుకుంటే ప్రపంచం ఇప్పటికీ వణికిపోతుంది. జర్మన్ ప్రజల సంగతి సరే. యూదుల మీద కోపంతో నాటి నియంత హిట్లర్ వారిని ఊచకోత కోయించాడు. ఇందుకోసం  నాజీ క్యాంప్‌ల పేరిట ప్రత్యేక ఏర్పాట్లు చేయించాడు.

ఈ క్యాంపుల్లో లక్షలాది మంది యూదులను చంపేవారు. అయితే ఈ మారణకాండకు సంబంధించిన నేరాల గురించి నేటికి జర్మనీలో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో చివరి కేసులో జర్మన్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో సుమారు 5,232 మంది ఖైదీలను, అనేక మంది యూదులను హత్య చేయడానికి సాయం చేసిన 93 ఏళ్ల బ్రూనో డి అనే వ్యక్తిని హాంబర్గ్ కోర్టు దోషిగా తేల్చింది.

నాటి నేరాలకు గాను అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం పోలాండ్‌లోని గ్డాన్క్స్‌కు సమీపంలోని స్టుతోఫ్ కాన్సంట్రేషన్‌ క్యాంపులో ఎస్ఎస్ బ్రూనో డి గార్డుగా పనిచేసేవాడు.

ఈ నేపథ్యంలో 1944 - 1945 మధ్య జరిగిన ఈ హత్యలకు బ్రూనో సహకరించినట్లు హాంబర్గ్ కోర్టు గురువారం తెలిపింది. ఈ నేరం జరిగినప్పుడు అతని వయసు 17 నుంచి 18 సంవత్సరాలు కావడం బ్రూనోకి కలిసొచ్చింది.

యువత శిక్షా మార్గదర్శకాలకు లోబడి కేవలం రెండేళ్ల శిక్షను మాత్రమే విధించినట్లు న్యాయస్థానం వెల్లడించింది. తీర్పు సందర్భంగా బ్రూనో మాట్లాడుతూ.. తాను ఆ సమయంలో కాన్సంట్రేషన్ క్యాంపులో విధులు నిర్వర్తిస్తున్నట్లు అంగీకరించాడు.

అయితే హత్యలకు సహకరించాల్సి వచ్చిందని.. దానిలో తన తప్పేమీ లేదని తెలిపాడు. నాటి మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబసభ్యులకు బ్రూనో క్షమాపణలు చెప్పాడు.

స్టుతోఫ్‌లో దాదాపు 65 వేల మందిని హత్య చేశారని మ్యూజియం వెబ్‌సైట్ వెల్లడిస్తుంది. వీరిలో యూదులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు పేర్కొంది. వీరిలో కొందరిని తల వెనుక కాల్చి చంపగా.. మరికొందరినీ ప్రాణాంతకమైన జైక్లాన్ బీ వాయువు ప్రయోగించి చంపినట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.