ఆ వైసిపి ఎమ్మెల్యేల ఓట్లు కూడా ఖచ్చితంగా నాకే...: టిడిపి రాజ్యసభ అభ్యర్థి వర్ల
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థి వర్ల రామయ్య సంచలన కామెంట్స్ చేశారు. వైసిపికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తనకు ఓటేయాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు.
గుంటూరు: తెలుగుదేశం పార్టీ తరుపున తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచీ వైసీపీకి చెందిన కొందరు నేతలు తనపై వల్లమాలిన ప్రేమాభిమానాలు చూపుతున్నారని... టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గతంలో తనకు రాజ్యసభ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తనకేదో తీరని అన్యాయం చేశాడని వారంతా తెగ బాధపడుతున్నారని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఎద్దేవాచేశారు.
బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీకి చెందిన దళిత నేత తనకేదో అన్యాయం జరిగిందని, రాజ్యసభ దక్కలేదని తాను కన్నీళ్ల పర్యంతమయ్యాయని చెబుతూ తెగ బాధపడుతూ ఎక్కడలేని ప్రేమ చూపుతున్నారని... సదరు నేతకు తనగురించి పూర్తిగా తెలియక రాజకీయం చేయాలన్న దురుద్దేశంతో ఏదేదో మాట్లాడుతున్నాడని రామయ్య స్పష్టం చేశారు. 2018లో టీడీపీ అధిష్టానం తనకు రాజ్యసభ స్థానం ఇవ్వాలనుకున్న మాట వాస్తవమే కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఇవ్వలేకపోయారని... దానిగురించి తాను ఏనాడూ బాధపడలేదని, ఎప్పటిలాగే తనపార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్నానని తెలిపారు.
పార్టీ ఆదేశాలకు లోబడి తాను యోధుడిలా పనిచేస్తాను తప్ప పదవులు రాలేదని వెనకడుగు వేయనని ఆయన తేల్చిచెప్పారు. అటువంటిది తనస్థాయి దిగజార్చేలా వైసీపీ నేత, సాక్షిపత్రిక, సాక్షిఛానల్ చెత్త ప్రచారం చేస్తున్నారని వర్ల మండిపడ్డారు. వ్యక్తిత్వాలకు భంగం కలిగేలా చెత్తవార్తలు ప్రచారం చేస్తారు కాబట్టే సాక్షి మీడియాను చెత్తమీడియాగా తాను సంబోధిస్తున్నానన్నారు.
చంద్రబాబునాయుడి ఆలోచనలలో ప్రతిరోజూ పాలుపంచుకునే తనలాంటి వ్యక్తిని గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రులు ఆదిమూలపు సురేశ్, సుచరిత వంటి వైసీపీలోని దళితనేతలు జగన్ వద్ద ఏనాడైనా సన్నిహితంగా, తాను చంద్రబాబు వద్ద ఉన్నవిధంగా ఉండగలిగారా అని వర్ల ప్రశ్నించారు. 10నెలల వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన, అస్తవ్యస్త విధానాలపై ప్రజల్లో చర్చ జరగడంకోసమే తాను రాజ్యసభకు పోటీచేస్తున్నాను తప్ప గెలుపుకోసం కాదన్నారు.
read more టిడిపి నేతలపై దాడిచేసింది కిశోర్... చేయించింది మాత్రం ఆ ఎమ్మెల్యేనే...: అచ్చెన్నాయుడు
తమపార్టీకి 23మంది సభ్యులే ఉన్నందున గెలుపు అవకాశాలు లేవని తెలుసునని... తెలిసికూడా తాను రాజ్యసభకు ఎందుకు పోటీచేస్తున్నానో తెలుసుకోలేని వెర్రితనం వైసీపీనేతల్లోనే చూస్తున్నానన్నారు. వైసీపీవారు ఇంత తెలివిగలవారు కాబట్టే జగన్ వారితో కబాడి ఆడిస్తున్నాడని రామయ్య దెప్పిపొడిచారు. తమ పార్టీ తరుపున రాజ్యసభకు పలానా అభ్యర్థులను ఎంపికచేశాననిగానీ, వారికున్న అర్హతలు ఇవనీగానీ జగన్ ఏనాడైనా తన గురించి మాట్లాడుతున్న మంత్రులతో గానీ, ఇతరనేతలతో గానీ సంప్రదించాడా అని రామయ్య నిలదీశారు.
''వైసీపీ తరుపున రాజ్యసభ అవకాశం ఇద్దరు బీసీలకు, ఒకరెడ్డికి, మిగిలిన స్థానాన్ని మరొకతనికి ఇవ్వాలి... ఆసీటుకి బరువెక్కువ.. అది ఇవ్వకపోతే తన ఉనికికే ప్రమాదం'' అని జగన్ ఏనాడైనా తన పార్టీవారితో గానీ, తన గురించి మాట్లాడుతున్న దళితనేతలతో గానీ చర్చించాడా... అని రామయ్య నిగ్గదీశారు. సూర్యాపేటలోని తనఇంట్లో నిద్రపోతున్న ఆకారపు సుదర్శనం అనే దళితనేతను హైదరాబాద్ కు పిలిపించి, రాజ్యసభకు పంపిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని, ఇలాంటి ఘటనలు వైసీపీలో ఏనాడైనా జరిగాయా అని రామయ్య ప్రశ్నించారు.
ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో దళితులకు ఒక్కస్థానం కూడా ఎందుకివ్వలేదని వైసీపీలోని దళితనేతలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి, ఆవర్గానికి చెందిన వారికి రాజ్యసభస్థానం ఎందుకు ఇవ్వరని జగన్ ను అడిగే దైర్యం వైసీపీలోని దళితమంత్రులకు, నేతలకు ఉందా అన్న రామయ్య, అలా అడగటంకోసం రెండుకాళ్లతో జగన్ ముందు నిలబడే ధైర్యం కూడా వారికి లేదని స్పష్టంచేశారు. వారిపార్టీలోని దళితనేతలకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించలేని వారు తనగురించి, తనపార్టీ గురించి ప్రశ్నించడం చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు.
read more బోండా ఉమ, బుద్దాలపై దాడిచేసింది ఆ యువకులే...: కేఈ కృష్ణమూర్తి
తెలుగుదేశం పార్టీలో తానొక యుద్ధ యోధుడినని, అంబేద్కర్ భావజాలాన్ని రాజ్యసభలో వినిపించే ధైర్యం తనకు మాత్రమే ఉందని, అలాంటి తనకు ఆత్మప్రబోధానుసారం ఓట్లేసే ధైర్యం వైసీపీ ఎమ్మెల్యేలకు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందా అని రామయ్య నిలదీశారు. అంబేద్కర్ భావజాలాన్ని ధైర్యంగా, సుస్పష్టంగా రాజ్యసభలో వినిపించగల ఏకైక వ్యక్తి వర్ల రామయ్యేనని నమ్మితే, వైసీపీ అధినేత సహా ఆపార్టీలోని ఎమ్మెల్యేలందరూ తనకే ఓటేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. వైసీపీలోని దళిత ఎమ్మెల్యేలంతా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే, ఆత్మప్రబోధానుసారం మసులుకుంటే కచ్చితంగా తనకే ఓటేస్తారని రామయ్య స్పష్టంచేశారు.
ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేలు ఆత్మలేదు.. పరమాత్మ లేదు... మానాయకుడు సిట్ అంటే సిట్... స్టాండ్.. అంటే స్టాండ్ అనుకుంటే తానేమీ వారిని ఇబ్బంది పెట్టబోనన్నారు వర్ల రామయ్య.