బోండా ఉమ, బుద్దాలపై దాడిచేసింది ఆ యువకులే...: కేఈ కృష్ణమూర్తి
టిడిపి నాయకులు బోండా ఉమ, బుద్దా వెంకన్నలపై గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన దాడిని మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఖండించారు.
గుంటూరు: టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి కెఈ కృష్ణమూర్తి తెలిపారు. ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే వైసిపి నాయకులు కార్యకర్తలను ఉపయోగించిన టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే మాచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.
గుంటూరు జిల్లా మాచర్లలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన టిడిపి అభ్యర్థుల నుండి నామినేషన్ పత్రాలు దౌర్జన్యంగా లాక్కుని చించేశారని... ఎన్నికల్లో ఫోటీ చేయడానికి వీల్లేదంటూ అడ్డుకున్నారని అన్నారు. దీంతో ఈ విషయం తమ పార్టీ నాయకులు బుద్దా వెంకన్న, బోండా ఉమల దృష్టికి రావడంతో న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి అడ్వోకేట్ తో కలిసి అక్కడికి వెళ్లారని... వారిపై కూడా వైసిపి నాయకులు దౌర్జన్యాన్ని ప్రదర్శించారని అన్నారు.
read more మాచర్ల ఘటనపై స్పందించిన డిజిపి... ఐజి, ఎస్పీలకు ఆదేశాలు
'' టిడిపి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన నేతలపై దాడి చేస్తారా? రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేస్తారా? రాష్ట్రంలో ఫ్యాక్షన్ సంస్కృతి, కక్షా రాజకీయాలు ఎంతలా పేట్రేగిపోతున్నాయో చెప్పడానికి ప్రస్తుత ఘటనే సాక్ష్యం. మాజీ మంత్రిపైన, ఎమ్మెల్సీపైన వైసీపీ యువజన నేతలు బరితెగించి దాడికి పాల్పడ్డారంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అసలు ప్రజలకు జగన్ ప్రభుత్వంలో రక్షణ ఉందా.?'' అని ప్రశ్నించారు.
''పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారంటే వారి వెనుక ముఖ్యమంత్రి జగన్ లేరని చెప్పగలరా.? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. రాక్షస రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. ఇప్పుడు అది నిజమని తేలింది. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించండి. ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించే వారిని ఎన్నుకోవడంలో కీలకంగా వ్యవహరించండి'' అని కేఈ ప్రజలకు సూచించారు.
read more మాచర్ల దాడి: జగన్ తో ఉన్న దాడి చేసిన వ్యక్తి ఫోటో వైరల్