ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో మూడు రాజధానులు వచ్చే ఛాన్స్ వుందంటూ చేసిన ప్రకటన రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. తాజాగా దీనిపై జనసేన అధినేత, పవన్ కల్యాణ్ ట్వీట్టర్ ద్వారా స్పందించారు. 

‘‘తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట. అలాగా, ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు ఇప్పటి దాకా ; మరి జగన్ రెడ్డి గారి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా..? పాలకుల వలన, రాష్ట్ర విభజన మొదలుకొని, ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనిశ్చితి, అశాంతి, అభద్రత తప్ప ఇంకేమి ఒరగలేదు’’ పవన్ ట్వీట్ చేశారు. 

Also Read:జగన్ నిర్ణయంతో జనానికి ముప్పు తిప్పలే: మూడు రాజధానులపై బాబు వ్యాఖ్యలు

మంగళవారం అమరావతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రసంగించిన జగన్ .. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం వుందన్నారు. ఈ క్రమంలో అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్న సంగతిని జగన్ గుర్తుచేశారు. పాలన దగ్గర, జూడీషియల్ ఒక దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుందని దీని ఆధారంగా ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 

Also Read:ఏపీకి మూడు రాజధానులు వచ్చే ఛాన్స్: అసెంబ్లీలో జగన్

40 ఏళ్ల అనుభవం వున్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. విశాఖలో అన్ని వున్నాయని.. ఒక మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మిస్తే సరిపోతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా రెండు సంస్థలకు బాధ్యతలు అప్పగించామన్నారు.