టీడీపీ నేత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌పై వైసీపీ నేత బొప్పన భవకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికా విహారాయత్రకు వెళ్లి వచ్చిన గద్దె రామ్మోహన్ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

4 వేల మంది పేదలకు ఇల్లు, ఇళ్ల స్థలాలు  ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి గెలిసిన వ్యక్తి గద్దె రామ్మోహన్ అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని... జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక టీడీపీ ఎమ్మెల్యేలకు ఒకొక్కరికి కోటి రూపాయలు నిధులు ఇస్తున్నారని బొప్పన గుర్తుచేశారు.

వైఎస్సార్‌సీపీ కన్నతల్లి లాంటిదని.. పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్న  స్వాగతిస్తామని భవకుమార్ స్పష్టం చేశారు. దేవినేని అవినాష్ పార్టీలోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నానని.. పార్టీ బలోపేతంకు అవినాష్, నేను కలిసి పనిచేస్తామన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చి అనేక మంది పార్టీలో చేరుతున్నారని భవకుమార్ తెలిపారు. 

Also Read:ఆ పథకమే నన్ను వైసిపి వైపు నడిపించింది...: దేవినేని అవినాశ్

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని... ఆయన అడుగుజాడల్లోనే నడిచి రాష్ట్రాభివృద్దికి సహకరించడం కోసమే వైఎస్సార్‌సిపి లో చేరుతున్నట్లు దేవినేని అవినాశ్ వెల్లడించారు. ముఖ్యంగా ప్రజాసంక్షేమమే ద్యేయంగా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అవినాశ్  వెల్లడించాడు. 

సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరుతున్నానని అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే పార్టీలో నడుస్తానని... అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జగన్ సీఎం అయ్యేందుకు సైనికుడిలా పని చేస్తానని అన్నారు. 

తన వర్గం కార్యకర్తలకు, నాయకులకు పార్టీలు అన్యాయం జరుగుతుందని ఎన్నిసార్లు చంద్రబాబునాయుడు, లోకేశ్ ల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదన్నారు. అందువల్లే వారికి గౌరవం దక్కని పార్టీలో వుండకుడదని నిర్ణయించుకున్నానని... అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకే  వైసిపిలో చేరినట్లు అవినాశ్ వెల్లడించారు. 

Also Read:టీడీపీకి దేవినేని అవినాష్ రాజీనామా

తనమీద నమ్మకంతో టిడిపి అప్పజెప్పిన ప్రతిబాధ్యతని నిజాయితీ, క్రమశిక్షణతో నిర్వహించానని...గత ఎన్నికల్లో అనువైన స్థానం కాకపోయినా చంద్రబాబు ఆదేశాల  మేరకు గుడివాడ నుండి పోటీచేశానని తెలిపారు. ఓటమి బాధ కలిగించినా లెక్కచేయకుండా పార్టీ కోసమే ముందడుగేసానని... కానీ ఇన్నాళ్లుగా అనుక్షణం వెన్నంటి ఉన్న కార్యకర్తలకు, దేవినేని నెహ్రూ అనుచరులకు తగిన ప్రాధాన్యం దొరకకపోవడం బాధ కలిగించిందని ఆవేధన వ్యక్తం చేశారు.