క్రైమ్ రౌండప్ 2019... విజయవాడలో పెరిగిన హత్యలు
విజయవాడ నగరంలో 2018 సంవత్సరంతో పోలిస్తే 2019 లో నేరాల శాతం తగ్గినట్లు పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. అయితే హత్యల శాతం మాత్రం పెరగిపోయినట్లు తెలిపారు.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ నగరమైన విజయవాడలో ఈ ఏడాది హత్యల శాతం పెరిగినట్లు నగర పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. అయితే నేరాల శాతం మాత్రం భారీగా తగ్గిందని తెలిపారు. అంతేకాకుండా రాజధానికి అతి సమీపంలో నగరంలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖ సక్సెస్ అయినట్లు సిపి వెల్లడించారు.
2019 లో విజయవాడ ప్రజలకు మెరుగైన సేవలు అందించగలిగామన్నారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు ఐఎస్‌వో సర్టిఫికెట్ లభించిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని వెల్లడించారు.
2019 లో విజయవాడలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. సాధారణ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించామని... దసరా, భవాని దీక్షలు, మేరిమాత ఉత్సవాలకు బందోబస్తు ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యాంమన్నారు. ఇక సీఎం జగన్, గవర్నర్, లోకాయుక్త ప్రమాణ స్వీకారాలకు ఏర్పాట్లు బాగా చేసినట్లు ప్రశంసలు అందాయని సిపి గుర్తుచేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది ఉప్పొంగి వరదల సమయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించామన్నారు. ఇక నేరాల విషయానికి వస్తే కమీషనరేట్ పరిధిలో హల్ చల్ చేసిన బ్లేడ్ బ్యాచ్ ఆటలు కట్టించినట్లు తెలిపారు. వారిని అదుపు చేయడంలో సక్సెస్ అయ్యామన్నారు.
read more జైలులో రైతులను పరామర్శించనున్న చంద్రబాబు
వివిధ నేరాలతో ప్రమేయమున్న నలుగురిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 13 శాతం నేరాల శాతం తగ్గిందన్నారు. 2018లో అన్ని రకాల కేసులు కలిపి 9523 నమోదవగా 2019 లో 9100 కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. అంటే గతంతో పోల్చితే తాము బాగా పనిచేసినట్లు అర్థమవుతుందన్నారు.
కానీ హత్యలు మాత్రం 4శాతం పెరిగాయన్నారు. ఇక కిడ్నాప్ కేసులు 25 శాతం తగ్గగా... రౌడీయిజం కేసులు కూడా బాగా తగ్గాయన్నారు. ప్రాపర్టీ కేసుల విషయంలో పురోగతి సాధించామని తెలిపారు.
డయల్ 100, నైట్ బీట్ లు సమర్ధవంతంగా పనిచేసాయని అన్నారు. నిత్యం ప్రజల్ని అప్రమత్తం చేయడం వలన నేరాల శాతం తగ్గినట్లుగా సిపి పేర్కొన్నారు. టెక్నాలజీ సాయంతో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకున్నామని... నెలవారీ సమీక్షల వలన సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగిందన్నారు.
read more మైనర్ బాలికకు బలవంతపు పెళ్లి... ఇంట్లోనే బంధించి...
నేరాల రికవరీ 74 శాతం పెరిగినట్లుగా వెల్లడించారు. శాంతిభద్రతలు,నేర విభాగం కు మధ్య పోటీ పెట్టడం వలన ఈ రికవరీ శాతం గణనీయంగా పెరిగిందన్నారు.మహిళల పట్ల నేరాల శాతం కూడా తగ్గుముకం పట్టిందన్నారు. మహిళలు, యువతలో అవగాహన పెరిగడంతో వేధింపుల కేసులు బాగా పెరిగాయని సిపి తిరుమలరావు వెల్లడించారు.