జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అధర్మం, అన్యాయం, దుష్ట సంప్రదాయం వీటిని పవన్‌ కల్యాణ్‌ కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఈ మధ్యకాలంలో వీరు మాట్లాడుతున్నమాటలు చూస్తే భక్తితో, మతంతో రాజకీయం చేయాలని ఆటలాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని విష్ణు ఎద్దేవా చేశారు.

అసలు హిందుత్వంపై మాట్లాడే నైతిక హక్కు పవన్‌ కల్యాణ్‌ కు ఉందా? ఐదు సంవత్సరాల టిడిపి పాలనను వదిలేసి ఐదునెలలు కూడా కాని మా పరిపాలనపై మాట్లాడే నైతిక హక్కు ఉందా? అంటూ ప్రశ్నించారు.

Also Read:మేం ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదు, కానీ...: పవన్ కల్యాణ్

చంద్రబాబు పాలనలో హిందూమనోభావాలను దెబ్బతీసే విధంగా హిందుత్వంపై దాడి జరిగితే ఆరోజు బిజేపి,టిడిపి,జనసేనలు కలసి ఉన్న ప్రభుత్వంలో  మాట్లాడలేదని మల్లాది గుర్తుచేశారు. 40 దేవాలయాలను కూలిస్తే నోరు మెదిపారా? అమ్మవారి దేవస్దానంలో క్షుద్రపూజలు చేస్తే మాట్లాడలేదని విష్ణు ఫైరయ్యారు.

సదావర్తి భూములను టిడిపి నేతలు కాజేస్తుంటే మాట్లాడలేదని... పుష్కరాలలో 29 మంది చనిపోయినా, 3 వేల కోట్ల రూపాయలు టిడిపి నేతలు లూటీ చేసినా మాట్లాడలేదని ఆయన నిలదీశారు. ఇన్నిసార్లు నోరుమెదపని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మాత్రం కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకు మాట్లాడుతున్నారని విష్ణు చురకలంటించారు.

151 మంది ఎంఎల్‌ ఏలతో అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మల్లాది గుర్తుచేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తూచ తప్పకుండా అమలు చేస్తుంటే ఆ సంక్షేమ కార్యక్రమాలను సమర్దించకుండా వాటిపై బురద చల్లేందుకు పవన్‌ నడుంబిగించారని ఆయన మండిపడ్డారు.

క్రిష్టియన్లన్నా,ముస్లింలన్నా వారికి పడకపోతే చంద్రబాబు,పవన్‌ కల్యాణ్‌ లు డైరక్ట్‌ గా చెప్పాలని మల్లాది సూచించారు. ఏ అర్హత ఉందని ఈ ప్రభుత్వాన్ని వైయస్‌ జగన్‌ ని పవన్‌ కల్యాణ విమర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

Also Read:గవర్నర్ సాబ్.. చూస్తున్నారా, మా బలం ఇది: కాంగ్రెస్, ఎన్సీపీ, సేనల బలప్రదర్శన

ఐరోపా వెళ్లినప్పుడు ఒకలా,హైద్రాబాద్‌ వెళ్లినప్పుడు మరోలా, విజయవాడ వస్తే ఇంకోలా మాట్లాడతారని సెటైర్లు వేశారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా అందిస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా చేస్తున్నారని విష్ణు ఆరోపించారు. వందమంది చంద్రబాబులు ఒక్కటైనా జగన్‌‌ను ఏమీ చేయలేరని మల్లాది విష్ణు సవాల్ విసిరారు.