హైదరాబాద్: తమ పార్టీ ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని, కానీ తెలుగు మీడియం కూడా ఉంటాలని కోరుతున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.ఓట్లు పడతాయా లేదా అనే ఆలోచనతో కాకుండా ప్రజలకు మేలు కలుగుతుందా లేదా అనే యోచనతో  రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 

అవకాశవాద రాజకీయాలకు జనసేన పార్టీ దూరంగా ఉంటుందని, పార్టీ భావజాలంకు అనుగుణంగా పని చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ నెల 3వ తేదీన జరిగిన లాంగ్ మార్చ్ అపూర్వ విజయానికి  పార్టీ ఆలోచన విధానమే కారణమని అన్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. 

 "ఆంధ్ర ప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కొత్త తరం, పాత తరం మధ్యన అంతరాలు ఉన్నాయి.. భావితరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోకపోతే అన్యాయం చేసినవాళ్ళం అవుతాం. సంప్రదాయ, సంకుచిత రాజకీయాలను పక్కన పెడదాం" అని పవన్ కల్యాణ్ అన్నారు. "నేను బహిరంగంగా ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా. ఇలా మాట్లాడితే ఒక వర్గానికి కోపం వస్తుందని, వేరేలా మాట్లాడితే ఇంకొక వర్గానికి కోపం వస్తుందని భావించి నా పంథాను మార్చుకోను" అని అన్నారు. 

"భావితరాలకు మేలు కోసం ఏమి చేస్తే మంచిదో అదే మాట్లాడతాను. మనం ఏం మాట్లాడినా రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడదాం. పోరాట యాత్ర సందర్భంగా నేను అనేక విషయాలు గమనించా. పాతుకుపోయిన సమస్యలను చూశా. మనకు వనరులు తక్కువగా ఉన్నాయి... అయితే ఆకాంక్షలు అపరిమితంగా ఉన్నాయి" అని పవన్ కల్యాణ్ అన్నారు. 

"యువతకు ఉపాధి మార్గాలు చూపకపోతే అశాంతి నెలకొంటుంది. తద్వారా సమాజంలో అనేక విభజనలు జరుగుతాయి. ప్రత్యర్ధి పార్టీల వారు ప్రలోభపెట్టో, భయపెట్టో ప్రజలపై పట్టు సాధించుకోవాలని చూస్తున్నారు. అయితే జనసేన పార్టీ ప్రజల అభిమానంతో క్రమంగా, స్థిరంగా ఎదుగుతుంది. సత్యం నిష్టురంగా ఉన్నా మనం స్పష్టంగా మాట్లాడదాం. అయితే దీనికి ప్రజల నుంచి మద్దతు ఒక్కసారి కాకుండా క్రమక్రమంగా వస్తుంది" అని ఆయన అన్నారు. 

"భాష అనేది ఒక సున్నితమైన అంశం. అది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది. అటువంటి రాష్ట్రంలో తెలుగును ప్రాథమిక స్థాయిలోనే బోధన భాషగా స్థానం లేకుండా చేయడం ఎంతవరకు సమంజసం. భాషను వదిలేస్తే సంస్కృతి నశించి, సంస్కృతి మూలాలు అంతరించిపోతాయి" అని పవన్ కల్యాణ్ అన్నారు.

"భాషలేని చోట సొంత రాష్ట్రంలోనే పరాయి వ్యక్తులుగా మనం మిగిలిపోతాం. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సైతం వారి వారి భాషల్లోనే వెలువడుతున్న ఈ రోజుల్లో మన తెలుగు పాఠశాలల్లో తెలుగు మాధ్యమం లేకపోవడం ఎంత వరకు సమంజసం" అని ఆయన అన్నారు.  
 
"జనసేన పార్టీ ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకం కాదు, తెలుగు మాధ్యమం కూడా ఉండాలని కోరుతున్నాం. నాయకులు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన డిమాండ్ లో ఉన్న మంచిని ప్రజలు కూడా గ్రహిస్తారు" పవన్ కల్యాణ్ అన్నారు. "నది ఉన్నచోట నాగరికత ఉంటుంది. భాష ఉన్నచోట నాగరికత పరిఢవిల్లుతుంది. అందువల్ల మన నుడి  - మన నది కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది నిరాంతరాయంగా సాగే పోరాటం" అని ఆయన అన్నారు. 

"డొక్కా  సీతమ్మ  పేరు మీద ఏర్పాటు చేసిన ఆహార శిబిరాలకు అపూర్వ ఆదరణ లభించినందుకు ఆనందంగా ఉంది. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించిన ఈ శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఆహారాన్ని అందించడం జనసైనికుల కార్యదక్షతకు గీటురాయి" ఆయన అన్నారు. 

"ప్రజలకు సేవ చేసిన అనేక మంది నాయకులు మరుగున పడిపోయారు. మన కార్యక్రమాలకు డొక్కా సీతమ్మ వంటి స్ఫూర్తిదాయక మహనీయుల పేర్లు పెట్టుకుందాం. ఇసుక సరఫరా సక్రమంగా, సజావుగా సాగే వరకు జనసైనికులు ఒక కంట కనిపెట్టి ఉండాలి. ఇసుక సరఫరాలో అక్రమాలు చోటుచేసుకుంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి" అని అన్నారు. 
 
"త్వరలోనే రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తా. పర్యటనకు సంబంధించిన కార్యక్రమాన్ని పార్టీ ప్రతినిధులు రూపకల్పన చేస్తున్నారు. రాయలసీమలో జనసేనకు అపారమైన క్యాడర్ ఉంది. క్యాడర్ ను సమష్టిగా ఉంచి వారిని ముందుకు నడిపే నాయకత్వాన్ని సిద్ధం చేద్దాం" అని పవన్ కల్యాణ్ అన్నారు. "నిలకడగా పనిచేసేవారిని రాయలసీమలో గుర్తించాలి. కార్యకర్తలను రక్షించుకోవాల్సిన పరిస్థితి పలుచోట్ల ఉంది. వారికి అండగా నిలుద్దాం" అన్నారు. డిసెంబర్ 15వ తేదీలోగా పార్టీ మండల, పట్టణ కమిటీల నియామకాలను పూర్తి చేయాల"ని  అన్నారు.
  
విశాఖలో లాంగ్ మార్చ్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున పీఏసీ ఛైర్మన్  నాడెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ శిబిరాలను విజయవంతం చేసిన వారికి కూడా అభినందనలు తెలిపారు. పార్టీ అధ్యక్షుని మనోభావాలకు అనుగుణంగా పార్టీ మండల, పట్టణ కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు తోట చంద్రశేఖర్ , టి.శివ శంకర్,  తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఇంచార్జ్  నాగబాబు, పీఏసీ సభ్యులు కనకరాజు సూరి,  కందుల దుర్గేష్,  కోన తాతారావు,  ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, మనుక్రాంత్ రెడ్డి, బి.నాయకర్, డా.పసుపులేటి హరిప్రసాద్, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, చిలకం మధుసూదన్ రెడ్డి, బి.శ్రీనివాస యాదవ్, పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పార్టీ అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.