విజయవాడ: ఉగాది నాటికి పేదలకు ఇళ్లు ఇచ్చే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 2  లక్షల 70 వేలు, విజయవాడ లో 80 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 

పేదలకు ఇళ్ళ స్ధలాల కేటాయింపులపై విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో కృష్ణాజిల్లా యంత్రాంగంతో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, మున్సిపల్‌ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. 

ఈ  సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా 4 వేల ఎకరాల భూములు సేకరించామని తెలిపారు. విజయవాడ లోని పేదలకు రాజధాని లో సెంటు భూమి ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. 

read more  ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ దిశగా అడుగులు... సీఎం జగన్ ఆదేశాలు

ఎస్సీల స్ధలాలు లాక్కుంటున్నామని చంద్రబాబు అవాకులు చవాకులు పేలుతున్నారని... 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొనే ఆయన ప్రోత్సహించకపోయినా పర్లేదు కాని విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. టిడిపి నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వున్నాయన్నారు. గజం భూమి ఇవ్వలేని చంద్రబాబు సెంటు భూమి ఇస్తే మాపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. 

జక్కంపూడి లో ఇండ్లంటూ విజయవాడలోని పేదల వద్ద టిడిపి నేతలు అడ్డంగా దోచుకున్నారని మండిపడ్డారు. 5 వేల ఇళ్ళుంటే 9 వేలకు పైగా ఇళ్ళుల పేరుతో స్లిప్పులిచ్చి మోసం చేయడానికి సిగ్గులేదా.... అని ఆరోపించారు. పేదల రక్తంతో ఇళ్ళు కట్టి వారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. 

తమ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ళు ఇస్తే విమర్శలు చేస్తారా అని అన్నారు. ఇళ్ల కోసం గత ప్రభుత్వానికి డబ్బులు కట్టిన వారికి తాము అన్యాయం చేయబోమన్నారు.  ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇల్లస్థలాలు ఇవ్వాలని జగన్ సంకల్పించినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షం ఎన్ని కుయుక్తులు పన్నినా పేదలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చి తీరుతామన్నారు. 

read more  నీటి కొరతకు శాశ్వత పరిష్కారం... ఇజ్రాయెల్ ప్రతినిధులతో జగన్ సమావేశం

ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ....వైఎస్ హయాంలో జక్కంపూడి లో 17 వేలు ఇల్లు ఇస్తే జగన్ సిఎం అయ్యాక విజయవాడలో 80 వేల మందికి ఇల్లు ఇవ్వడం శుభపరిణామమన్నారు. టిడిపి నేతలు విమర్శలు చేస్తే సహించబోమన్నారు. పేదలకు ఇళ్ళు ఇస్తున్న ఘనత జగన్ దే అని కొనియాడారు. ఓట్ల కోసమే గత ప్రభుత్వం ఇళ్ళ పేరుతో నాటకాలాడి దోచుకుందని... అలా మోసపోయిన వారికి కూడా తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.