అమరావతి:ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీని తయారుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని పెంచేలా, రాష్ట్ర అవసరాలకు సరిపోగా మిగిలిన విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు అనుకూలంగా పాలసీని తయారుచేయాలని సూచించారు. విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పాలసీ వుండాలని ఆదేశించారు. 

విద్యుత్‌రంగంపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి  ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌  పాలసీ ఉండాలన్నారు. 

read more  నీటి కొరతకు శాశ్వత పరిష్కారం... ఇజ్రాయెల్ ప్రతినిధులతో జగన్ సమావేశం

లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై కూడా ఈ సమావేశంలో సీఎం చర్చించారు. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని...ఈ విషయం అర్ధమయ్యేలా వివరించాలన్నారు. దీనివల్ల ప్రతిఏటా రైతులకు ఆదాయం వస్తుందని...భూమిపై హక్కులు కూడా ఎప్పటికీ వారికే ఉంటాయన్నారు. 

రాష్ట్రంలో మరో వేయి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు వస్తోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వీరికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 

అలాగే 10వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణంపై కూడా సమావేశంలో చర్చించారు. వీలైనంత త్వరగా ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణం విధివిధానాలపై సమావేశంలో సీఎం, అధికారులకు మధ్య చర్చ సాగింది. 

read more  గుజరాత్ కు కాదు మొదట ఏపీకే ట్రంప్...కానీ జగన్ వల్లే...: పంచుమర్తి అనురాధ

వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర విద్యుత్‌కోసం ఫీడర్ల ఆటోమేషన్‌ ఏర్పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే 2 ఏళ్లలోగా ఆటోమేషన్‌ పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.